iDreamPost
android-app
ios-app

నాగార్జునసాగర్‌ : లాస్ట్‌ పంచ్‌ కేసీఆర్‌దే అయితే..

నాగార్జునసాగర్‌ : లాస్ట్‌ పంచ్‌ కేసీఆర్‌దే అయితే..

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌పై దండెత్తారు. హాలియాలో జరిగిన సభలో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై పంచ్‌లు పేల్చారు. తెలంగాణ ఉద్యమ రోజుల్ని కూడా గుర్తు చేశారు. జానారెడ్డిది 30 ఏళ్లు, 60 ఏళ్ల చరిత్ర అని, ఇంత పొడుగు అంత పొడుగు అంటారని కానీ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలను అనాథగా వదిలేశారని చెప్పుకొచ్చారు.

తనకు సీఎం పదవి భిక్ష పెట్టింది జానారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలేనని కేసీఆర్‌ అన్నారు. పదవుల కోసం కాంగ్రెస్‌ నేతలు పెదవులు మూసుకున్నారని, కానీ.. తాను డిప్యూటీ స్పీకర్‌ పదవిని, ఎమ్మెల్యే పదవిని వదిలేసి ఉద్యమం మొదలుపెట్టానని గుర్తు చేశారు. ఉద్యమంలో వెనక్కి మళ్లితే రాళ్లతో కొట్టమని చెప్పిన విషయాన్ని వివరించారు. కాంగ్రెస్‌ సరిగ్గా ఉంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేదని అన్నారు.


సభ జరగకూడదని కుట్ర పన్నారు

కాంగ్రెస్‌ పార్టీ పదవుల కోసం పాకులాడే పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం తెలంగాణను వదిలివేస్తే, తాము తెలంగాణ కోసం పదవులను వదిలేశామని తెలిపారు. తాను సాగర్‌ కట్టమీద 40 వేల మందితో నీళ్ల కోసం బొబ్బ చేస్తుంటే జానారెడ్డి ఏనాడూ నోరు విప్పలేదన్నారు. ఆ సమయంలో ఎక్కడ నిద్ర పోయాడని ప్రశ్నించారు. పదవుల కోసం లొంగి వంగి ఉన్నది వాస్తవం కాదా? అని అన్నారు.

‘‘హాలియాలో సభ జరగకూడదని, నేను మిమ్మల్ని కలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది తల తోకలేని పని. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రితోపాటు సీఎంలు, మాజీ సీఎంలు విశేషంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం నేను ఎందుకు రాకూడదో, సభ ఎందుకు జరగొద్దనుకుంటున్నారో అర్థంకాని పరిస్థితి’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో నిర్వహించిన హాలియా సభలో తాను చెప్పినట్లు.. ఊళ్లోకి వెళ్లగానే చర్చ పెట్టి ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. ‘‘నేను చెప్పిందే వేదం కాదు. చర్చ పెట్టి నిజాలు నిగ్గుతేల్చాలి. ఎన్నికలంటే ఆగమాగం కావొద్దు. విచక్షణతో ఆలోచన చేసి ఓట్లు వేయండి’’ అని కేసీఆర్‌ సూచించారు.


జగదీశ్‌రెడ్డి రాజీనామాను సమర్ధిస్తున్నా

నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని ఒకటిన్నర సంవత్సరంలో పూర్తిచేయకుంటే రాజీనామా చేస్తానన్న మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటనను సమర్ధిస్తున్నానని కేసీఆర్‌ అన్నారు. అలంపూర్‌లో కాంగ్రెస్‌ నేతలు ఆర్‌డీఎస్‌ను పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. లిప్టు ఏర్పాటు చేస్తానని తాను హామీ ఇచ్చి నెరవేర్చానన్నారు. త్వరలోనే సాగర్‌లోనే కూర్చుని ఇళ్ల జాగాల సమస్యలను పరిష్కరించి సర్టిఫికెట్లు అందజేస్తానన్నారు. హాలియాలో డిగ్రీ కళాశాలతోపాటు సాగర్‌లో బీసీ గురుకుల పాఠశాల భవనంలో మరో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హాలియాలో షాదీఖానా కట్టించే బాధ్యత తనదేనన్నారు. గొర్రెల యూనిట్‌ ధర పెంచి రెండో విడతలో మూడు లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.


ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ను గెలిపిస్తే కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తానన్నారు. మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ కూడా ఉంటారని ఇక అభివృద్ధి ఎందుకు జరగదని చెప్పారు. 15 రోజుల్లోనే తానే సాగర్‌కు వచ్చి నియోజకవర్గ నాయకులను పిలిచి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో లిప్టులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడగబోమన్నారు. పోడుభూముల సమస్యపై ప్రజాదర్భార్‌ పెట్టి అవసరమైతే రెండు రోజులు ఇక్కడే ఉండి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఇలా అటు ప్రధాన పోటీగా భావిస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలతో పాటు, నియోజకవర్గ అభివృద్ధికి వరాలు కురిపించి ప్ర‌చారం ముగిసే ముందు రోజు కేసీఆర్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.