నాగార్జునసాగర్‌ను ఎలాగైనా ఖాతాలో వేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇటు శ్రేణులను, ఆశావహులను పోటీకి సిద్ధం చేస్తూ, అటు ప్రజలను ఆకట్టుకుకోవడానికి ఐక్యతా రాగాన్ని ఆలపిస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రూపంలో ఎదురయ్యే అగ్నిపరీక్షలో నెగ్గి తీరాలని ఆ పార్టీ యోచిస్తోంది.
అధికార టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటున్న కమలం నేతలు.. అదే దూకుడుగా వ్యవహరించి సాగర్‌లో విజయకేతనం ఎగురవేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత, టీడీపీ నుంచి ఏడాది కిందట పార్టీలో చేరిన అంజయ్యయాదవ్‌తో పాటు ప్రముఖ డాక్టర్ రవినాయక్, బాలూనాయక్, ఇంద్రసేనారెడ్డి.. ముఖ్య నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎవరికి వారి ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.
అధినాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని, కమలం గుర్తే నినాదంగా ముందుకు సాగాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలే చేయాలని, వ్యక్తిగతంగా ఎవరూ కార్యక్రమాలు చేయొద్దని దిశానిర్దేశం చేశారు. ఆశావహుల పేర్లు జాతీయ నాయకత్వానికి సిఫారసు చేస్తామని, అన్నీ పరిశీలించాకే అభ్యర్థిని ఖరారు చేస్తారని చెప్పారు.సాగర్ ఉప ఎన్నిక సన్నద్ధత, పార్టీ కార్యాచరణకు సంబంధించి సంజయ్ శనివారం, రాష్ట్రపార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, టికెట్టు ఆశిస్తున్న ఐదుగురు నేతలతో సంజయ్ ప్రత్యేకంగా చర్చించారు. నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావొచ్చని, ఏప్రిల్‌లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని చెప్పారు. తమలో ఎవరికి టికెట్టు ఇచ్చినా కలిసి పనిచేస్తామని పార్టీ నేతలు నివేదితరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రవికుమార్ నాయక్, అంజయ్యయాదవ్‌లతో చెప్పించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారితో ప్రమాణం చేయించారు. కాగా, తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఒకరిద్దరు మండల పార్టీ అధ్యక్షులు సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే నాగార్జున సాగర్‌లో అమలు చేయాలని సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికను కేవలం ఉప ఎన్నికలాగే చూడకుండా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించారు. హై కమాండ్ ఆదేశాలను పాటిస్తూ అవసరరమైన పెద్దల సహకారం తీసుకోవాలని, ఆ మేరకు బండి సంజయ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే నాగార్జునసాగర్‌పై బీజేపీకి భారీ ప్రణాళికలే ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు సర్వేలను నమ్ముకుని టీఆర్‌ఎస్ ఎత్తుగడలను వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలను నిర్వహించినట్లు తెలిసింది. తమ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు టీఆర్‌ఎస్ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు బీజేపీలో ఓ వర్గం పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నోటిఫికేషన్ విడుదలే తరువాయి హోరాహోరీ పోరుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.