నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి హాలియాలో సభలో మాట్లాడిన తర్వాత రాజకీయ వేడి పెరిగింది. ఆ సభలో ప్రధానంగా కాంగ్రెస్ టార్గెట్‌గానే కేసీఆర్ ప్రసంగం సాగింది.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గిన క్రమంలో తమ సిటింగ్ స్థానం సాగర్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే సాగర్ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు తెగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం సభ ముగిసిన మర్నాడే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి నాగార్జున సాగర్‌లో నేను పోటీ చేస్తున్నానని, ప్రస్తుతం తనకున్న వయసులో ఆ పదవి అవసరం లేదని, కానీ.. పార్టీ అభిప్రాయం మేరకు.. ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను నిలబెట్టేందుకు తాను బరిలో ఉంటున్నట్లు చెప్పి టీఆర్‌ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రజలు ఆశించినట్లుగా తెలంగాణలో పాలన సాగడం లేదని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్ల హామీలు ఇంతవరకూ అమలు చేయలేదని జానారెడ్డి మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్లు తన ఊరికే ఇంకా రాలేదని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు రూ. 2,500 కోట్లు ప్రకటిస్తే.. అందులో సాగర్ నియోజకవర్గానికి ప్రకటిచింది రూ. 72 కోట్లు మాత్రమేనన్నారు. దీంతో కొత్తగా ఆయకట్టు 25 వేల ఎకరాలు మాత్రమేనన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో ఎత్తిపోతల పథకాలతో 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. డిండి, పాలమూరు నీళ్లు 2022 జూన్ నాటికి పూర్తి చేసినా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తానని ఆయన అన్నారు. జానా ప్రకటన అనంతరం సాగర్‌లో జానారెడ్డి, పోటీ చేస్తారా, ఆయన కుమారుడిని నిలబెడతారా అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇటీవల నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాత నుంచే జానా ప్రచారం మొదలెట్టేశారు.
మిషన్ భగీరథపై జానారెడ్డి చేసిన విమర్శలను టీఆర్‌ఎస్ నేతలు తిప్పి కొడుతున్నారు. నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామంలోని తన ఇంటికే భగీరథ నీరు రావడం లేదన్న జానారెడ్డి మాటలు అబద్ధాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానం ఇచ్చారు. జానా ఇంటికి వస్తున్న నల్లా నీటిని ఫోటోలతో సహా ప్రదర్శించి రాజకీయ వేడి పుట్టించారు. మిషన్ భగీరథ నీరు అనుముల గ్రామానికి రావడం లేదన్న జానారెడ్డి ఆరోపణలో నిజం లేదన్నారు. అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా నీరందుతోందన్నారు. బ్రేక్ డౌన్ వల్ల ఒకట్రెండు రోజులు నీరు రాలేదన్న విషయం జానారెడ్డికి తెలియనట్లుందన్నారు. జానారెడ్డి ఇంటికీ, అనుముల గ్రామానికీ భగీరథ అధికారులు వెళ్లి నీరు వస్తున్నట్లు నిర్ధారించిన వీడియోను ప్రదర్శించారు.