iDreamPost
android-app
ios-app

వెబ్ సిరీస్ దర్శకుడితో చైతు సినిమా

  • Published Sep 30, 2020 | 5:48 AM Updated Updated Sep 30, 2020 | 5:48 AM
వెబ్ సిరీస్ దర్శకుడితో చైతు సినిమా

ప్రస్తుతం చివరి దశలో ఉన్న లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇది కాగానే విక్రమ్ కుమార్ రూపొందించబోయే థాంక్ యులో జాయినవుతాడు. దిల్ రాజు నిర్మాణం కాబట్టి  అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. దీని తర్వాత వెంకీ అట్లూరితో చేయోచ్చనే టాక్ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టొరీ చెప్పాడని, లైన్ నచ్చిన చైతు దాన్ని డెవలప్ చేయమని సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఫైనల్ అయ్యేదాకా కన్ఫర్మేషన్ ఇవ్వలేం కానీ చైతు ఈలోగా మరో ప్రాజెక్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ టైంలో విడుదలైన వెబ్ సిరీస్ లూజర్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. 

ఇప్పటికే కొన్ని డిస్కషన్లు జరిగాయని త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోదని సమాచారం. క్రీడా నేపధ్యంలో ఎమోషన్స్ ని అద్భుతంగా చూపిస్తూ అభిలాష్ లూజర్ ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. దాని తర్వాత ఇంకొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ చైతుకి సరిపోయే సబ్జెక్టు సిద్ధంగా ఉండటంతో చైతన్య దీని వైపే మొగ్గు చూపినట్టు వినికిడి. థాంక్ యు పూర్తవ్వడానికి ఎంత లేదన్నా వచ్చే ఏడాది ఏప్రిల్ అవుతుంది. ఆలోగా ఏది ముందు మొదలుపెట్టాలనే నిర్ణయం తీసుకోవచ్చు. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నాగ చైతన్య చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతకు ముందు సక్సెస్ కొంత కాలం దూరమవ్వడంతో ఎలాంటి ప్రయోగాలకు ఇష్టపడటం లేదు. తనకు సూట్ కాని మాస్ జానర్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేస్తున్న ఎంటర్ టైనర్స్ వైపే మొగ్గు చూపుతున్నాడు. 
లవ్ స్టోరీ, థాంక్ యు ఆ కోవకు చెందినవే. యాక్షన్ థ్రిల్లర్లు, రివెంజ్ డ్రామాలు తనకు చేదు ఫలితాలు మిగిల్చాయి. యుద్ధం శరణం, సవ్యసాచి వాటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అందుకే రారండోయ్ వేడుక చూద్దాం లాంటి క్లీన్ మూవీస్ అయితే ఎలాంటి రిస్క్ ఉండదు. చైతు ఆలోచనా తీరుకు అలాగే ఉంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న లవ్ స్టోరీ జనవరి విడుదలను టార్గెట్ చేసుకుంటోంది. ఓటిటి ఆఫర్లు ఎన్ని వస్తున్నప్పటికీ  నిర్మాతలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యారు. చైతు సాయి పల్లవిల మొదటిసారి కాంబినేషన్ కావడంతో అభిమానులు దీని మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది.