iDreamPost
iDreamPost
మేము మేము బాగానే ఉంటాం మీరు అనవసరంగా గొడవలు పడకండని మన హీరోలు ఎన్ని సార్లు చెప్పినా కొందరు అభిమానుల్లో మార్పు రావడం లేదు సరికదా పైపెచ్చు ఇది ఏ మాత్రం హర్షించలేని సరికొత్త పెడధోరణికి దారి తీస్తోంది. ఒకప్పుడు వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టి తమ అపోజిషన్ హీరో మీద అక్కసు తీర్చుకునేవారు ఫ్యాన్స్. థియేటర్ల దగ్గర కొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఫేక్ ఐడిలతో అకౌంట్లు క్రియేట్ చేసి మరీ రెచ్చగొట్టే తరహాలో పోస్టులు ట్వీట్ లు పెట్టి అనవసర రాద్ధాంతానికి దారి తీస్తున్న ఉదంతాలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ దీనికి పెద్ద వేదికగా మారుతోంది.
హీరోలను అభిమానించడంలో తప్పేమి లేదు. కానీ దానికీ ఒక పరిమితి ఉండాలి. అవతలి వాళ్ళను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని పరుష పదజాలంతో, వాడకూడని మాటలతో సభ్యతను మర్చిపోవడమే క్షమించరానిది. దీని వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. పైగా తమ హీరోలను తామే బురదలోకి లాగి ఇలా అలుసయ్యేలా చేయడం తప్ప ఈ విషయాలేవీ తెలియని స్టార్లకు కలిగే నష్టం ఇంచు కూడా ఉండదు. అభిమానుల విలువైన సమయమే బోలెడంత వృధా అవుతుంది. గత నెల రోజులుగా మెగా అండ్ అక్కినేని ఫ్యాన్స్ మధ్య వర్డ్ వార్ మాములుగా జరగడం లేదు. ట్విట్టర్ లో స్పేస్ అనే కొత్త ఫీచర్ వచ్చాక ఇది ఇంకా ఎక్కువయ్యింది.
నిన్న ఈవివి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకులు, ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఎందరో నెటిజెన్లు స్పేస్ లో పాల్గొన్నారు. అందులో హరీష్ శంకర్ హలో బ్రదర్ లాంటి సినిమా చిరంజీవికి వచ్చి ఉంటే బాగుండేదని చెప్పడాన్ని ఇంకోలా అర్థం చేసుకున్న కొందరు ఆ విషయాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదే కాదు గతంలో మహేష్ పవన్ తారక్ చరణ్ ఫ్యాన్స్ తామేమి తక్కువా అనేలా రికార్డులు హిట్టు ఫ్లాపు రికార్డుల గురించి వాగ్వాదాలు చేసుకున్న సందర్భాలు లెక్కలేనన్ని. ఇది ఎవరికి వారు తెలుసుకుని విచక్షణతో మసులుకోవాల్సింది తప్పించి ఈ హీరోలందరూ మంచి సఖ్యతతో ఉంటూ ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం