iDreamPost
iDreamPost
అసలే బిగ్ బాస్ 4 వీక్ డేస్ ఒకలాగా వారాంతంలో మరోలా ఎదుగుదిగుడుగా సాగుతోంది. నాగార్జున ఉన్న రెండు ఎపిసోడ్లు మంచి జోష్ తో సాగుతూ రేటింగ్స్ తెచ్చుకుంటుండగా మిగిలిన రోజులు మాత్రం అటుఇటుగానే ఉన్నాయి. ఏదోలా వెరైటీ టాస్కులు, డ్రామాలతో నెట్టుకొస్తున్నారు కానీ ఐపిఎల్ రూపంలో గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థిని ఇంకా డెబ్భై రోజుల పాటు ఎదురుకోవడం అంత ఈజీ కాదు. ఇదే ఇలా ఉంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఓ నాలుగు వారాలు నాగార్జున మిస్ అయ్యే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం తను నటిస్తున్న వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇరవై రోజుల పాటు థాయిలాండ్ వెళ్ళాల్సి ఉందని సమాచారం.
చాలా కీలమైన షెడ్యూల్ కావడంతో వాయిదా వేయలేని పరిస్థితి. అలా అని బిగ్ బాస్ కు బ్రేక్ ఇవ్వలేని సిచువేషన్. అందుకే మధ్యస్థంగా ఎవరైనా టెంపోరరి యాంకర్ ని సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. సీజన్ 3లోనూ ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు రమ్యకృష్ణను తీసుకొచ్చారు. ఆవిడ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు కూడా. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా లేక ఇంకేదైనా పరిష్కారం దిశగా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా అధికారికంగా వచ్చిన న్యూస్ కాదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది. ఆహిశోర్ సోల్మన్ దర్శకత్వం వహిస్తున్న వైల్డ్ డాగ్ లో నాగార్జున రా ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. విదేశాల్లో జరిపే చిత్రీకరణతో కంప్లీట్ అవుతుందని వినికిడి.
బిగ్ బాస్ కు కొన్ని ఎపిసోడ్లే నాగ్ మిస్ అయినప్పటికీ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇది నిజమా కదా అనేది వేచి చూడాలి. ఈ షోకు తన యాంకరింగే దన్నుగా నిలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, నానిల కన్నా మెరుగైన ఫీడ్ బ్యాక్ తనకే దక్కింది. అసలే సిరీస్ 4లో సెలబ్రిటీ పార్టిసిపెంట్స్ పెద్దగా లేకపోవడం మైనస్ గా మారింది. ఇలాంటి ఇన్ హౌస్ గేమ్స్ కి పేరున్న వ్యక్తులు వస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా పాపులారిటీని ఆధారంగా చేసుకుని ఎక్కువ శాతం ఎంపిక చేసుకోవడం కూడా ఆడియన్స్ లో ఆసక్తిని తగ్గించింది. ఇలాంటి నేపధ్యంలో నాగార్జున కొంత గ్యాప్ ఇచ్చినా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఇది అఫీషియల్ గా తేలేదాకా బిగ్ బాస్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. అయినా ఏదో ఒక పరిష్కారం ఉండకపోదు లెండి.