iDreamPost
android-app
ios-app

న‌డ్డాపై దాడి : టీఎంసీ, బీజేపీ మ‌ధ్య ముదురుతున్న వివాదం

న‌డ్డాపై దాడి : టీఎంసీ, బీజేపీ మ‌ధ్య ముదురుతున్న వివాదం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై జ‌రిగిన దాడితో ప‌శ్చిమ బెంగాల్ లో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆ దాడిని సీరియ‌స్ గా ప‌రిగ‌ణించిన ఆ పార్టీ నేత‌లు టీఎంసీపై మాట‌ల యుద్ధంతో ప్ర‌తిదాడి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న క్ర‌మంలో నడ్డా కాన్వాయ్‌పై కొంద‌రు రాళ్లు రువ్వారు. నడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్‌ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గీయ, ముకుల్‌ రాయ్‌ మరికొందరు నేతలు గాయపడ్డారు. ఇక కైలాస్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ నడ్డాకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తృణమూల్‌ పాలనలో బెంగాల్‌ లో అరాచకత్వం రాజ్య మేలుతోం దన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది టీఎంసీ కార్యకర్తల ప‌నేన‌ని బీజేపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఓ ద‌శ‌లో అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించిన వీడియోని కైలాష్‌ విజయవర్గియా ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతుండ‌డంతో ప‌శ్చిమ బెంగాల్ లో వివాదం ముదురుతోంది.

బెంగాల్‌ డీజీపీకి సమన్లు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఇక నడ్డా కాన్వాయ్‌పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్‌ షా గవర్నర్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఈ దాడి నేప‌థ్యంలో బీజేపీ నాయకులు వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు, వ్యాఖ్య‌లు చేయ‌డంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ప్రతీకారం తీర్చుకుంటామని దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలను బెంగాల్ బీజేపీ నాయ‌కులు స్వాగతించారు. ఈ క్రమంలో సయంతన్‌ బసు ‘మీరు ఒక్కరిని చంపితే.. మేం నలుగురిని చంపుతాం’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్ కూడా ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్‌ కారు ఉంది కాబట్టే ఆయన బతికి బయట పడ్డారన్నారు.ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

అవ‌న్నీ బీజేపీ నాట‌కాలు : మ‌మ‌తా బెన‌ర్జీ

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం ఈ దాడిని కొట్టిపారేస్తున్నారు. ఇది బీజేపీ డ్రామాలో భాగ‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తమపై తామే దాడులు చేసుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌పై నేరాన్ని నెట్టేస్తున్నారని అన్నారు. సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు చుట్టూ ఉండగా వారికెందుకు భయమని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ స్పందిస్తూ.. ‘డైమండ్‌ హర్బర్‌కు వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డాజీ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. టీఎంసీ నిజ స్వరూపం ఏంటో దీంతో బట్టబయలు అవుతోంది’ అన్నారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నాయకులు ఖండించారు. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి అనుమతించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలా రెండు రోజులుగా బెంగాల్ లో రాజ‌కీయ మంట‌లు చెల‌రేగుతున్నాయి. వాటిని చ‌ల్లార్చేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నించాల‌ని, లేదంటే ప‌రిస్థితి అదుపు త‌ప్పే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు సూచిస్తున్నారు.