హాస్య చిత్రాలతోనే పేరు తెచ్చుకుని తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న అల్లరి నరేష్ ఇటీవలే బంగారు బుల్లోడుతో పలకరించిన సంగతి తెలిసిందే. దాని ఫలితం నిరాశపరిచినప్పటికీ రాబోయే నాంది మీద అభిమానులకు గట్టి ఆశలే ఉన్నాయి. నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లో తమ హీరో రెండో సినిమా విడుదల కావడం కంటే వాళ్లకు కావాల్సింది ఏముంటుంది. చాలా సీరియస్ ఇష్యూ మీద రూపొందిన నాంది కోసం అల్లరి నరేష్ సైతం చాలా కష్టపడ్డాడు. సీరియస్ జానర్ లోనూ తాను మెప్పించగలనని గతంలో నేను, ప్రాణం, గమ్యం, మహర్షి చిత్రాలతో మెప్పించిన నరేష్ నటించిన నాంది ట్రైలర్ ఇందాకా మహేష్ బాబు ద్వారా విడుదలయ్యింది.
రాజగోపాల్ అనే ప్రముఖ వ్యక్తి హత్య జరుగుతుంది. కానీ అది చేసింది సూర్యప్రకాష్(అల్లరి నరేష్)అని భావించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. తను అమాయకుడని చెప్పినా వినరు. ఈలోగా అండర్ ట్రయిల్ కింద అయిదేళ్ళు గడిచిపోతాయి. తన తరఫున లేడీ లాయర్(వరలక్ష్మి శరత్ కుమార్)న్యాయం కోసం పోరాడుతుంది. పోలీస్ ఆఫీసర్(హరీష్ ఉత్తమన్), డిఫెన్స్ లాయర్(శ్రీకాంత్ అయ్యంగార్)ఇద్దరూ సూర్యను టార్గెట్ చేసి వేధిస్తారు. జైలు జీవితంలో నరకం చూసిన సూర్య ఎలా బయటపడ్డాడు, తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళను ఏం చేశాడనేదే అసలు కథ.
దర్శకుడు విజయ్ కనకమేడల చాలా లోతుగా ఆలోచించాల్సిన సామజిక సమస్యనే నాందిలో చూపించినట్టు కనపడుతోంది. కమర్షియల్ అంశాలకు చోటు లేని ఇలాంటి కథలను తెరకెక్కించడం కత్తి మీద సాము. అందులోనూ నరేష్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికితే ఇంకేముంది. నాందికి ఈ రెండు బాగా కుదిరాయి. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం, సిద్ ఛాయాగ్రహణం రెండూ థీమ్ కు తగ్గట్టు సాగాయి. ఆర్టిస్టులు తక్కువగానే ఉన్నప్పటికీ టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ కనిపిస్తోంది. నరేష్ చాలా కాలం తర్వాత నటనపరంగా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. అంచనాలు రేపెలానే ఉన్న నాంది ఈ నెల 19న విడుదల కానుంది
Trailer Link @ http://bit.ly/3ro6f1N