టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎప్పుడో చేరుకున్నప్పటికీ దానికి మించి అనేలా మన నిర్మాతలు టేకప్ చేస్తున్న ప్రాజెక్టులు బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి మేనియాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం, టి సిరీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు అతనికి అండగా నిలవడం ఖాన్ల ద్వయానికి మింగుడు పడటం లేదు. తాజాగా మైత్రి సంస్థ చేస్తున్న, చేయబోతున్న మొత్తం సినిమాల విలువ సుమారు పదిహేను వందల కోట్ల దాకా ఉండటం చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఇవి ఇప్పటిదాకా కన్ఫర్మ్ గా చేయబోయే చిత్రాల కౌంట్ ను మాత్రమే తీసుకుని లెక్కగట్టినవి కావడం గమనించాల్సిన అంశం.
మహేష్ బాబు పరశురామ్ కాంబోలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీని మీద సుమారు 150 కోట్ల దాకా పెట్టుబడులు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ మీద కూడా ఇంతే మొత్తాన్ని పెడుతున్నారు. నానితో చేస్తున్న ‘అంటే సుందరానికి’ చూడ్డానికి మీడియం రేంజ్ లా కనిపిస్తున్నా దీనికీ 50 కోట్ల దాకా ఖర్చవుతోంది. త్వరలో మొదలుపెట్టే అవకాశం ఉన్న ‘పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్’ ప్రాజెక్ట్ కోసం వ్యయం లెక్కబెట్టడం కష్టమే. ఇదీ 150 కోట్ల దాకా పలుకుతుంది. గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి
ఇవి కాకుండా చిరంజీవి-బాబీ, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని, విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ, ప్రభాస్ – పాన్ ఇండియా ఇలా మరో 5 క్రేజీ సినిమాలు కూడా లైన్ లో పెట్టబోతున్నారు. అటుఇటుగా ఇందులో అధిక శాతం ఈ ఏడాది పూర్తయ్యేలోపే ప్రారంభమవుతాయి. ఎప్పుడు మొదలైనా 2022 చివరి నాటికంతా రిలీజయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏ లెక్కన చూసుకున్నా 1500 కోట్ల దాకా వీటి మీద థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్, ఆడియో హక్కుల మీద బిజినెస్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ఏక కాలంలో ఇంత భారీ ఎత్తున వెయ్యి కోట్ల ప్రాజెక్టులు టేకప్ చేసిన బ్యానర్ మైత్రి ఒక్కటే అని చెప్పాలి.