రాజకీయాల్లో నియంత మనస్తత్వాలు చెల్లవు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. వారిని మెప్పించాలి వారికి సేవలో తరించి రాజకీయాలు చేస్తేనే వారు నెత్తిన పెట్టుకుంటారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని మొత్తం తానే నడిపించేస్తానని, తనకు తిరుగే లేదని చెప్పుకున్న మాజీమంత్రి దేవినేని ఉమ ఇప్పుడు కనీసం పంచాయతీల్లో సైతం తాను నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోలేకపోయారు.
మొత్తం జిల్లా రాజకీయాలను శాసించిన మాట దేవుడెరుగు కనీసం తాను నివసిస్తున్న గ్రామం ఆనుకొని ఉన్న గ్రామంలో సైతం దేవినేని ఉమ మాటలను ఎవరూ నమ్మని పరిస్థితి పంచాయతీ ఎన్నికల ఫలితాలలో కనిపించింది. ఎన్నికల ముందు మంత్రులకు సవాలు చేసి, నిరసనల మాటున గొడవలు రేపి పంచాయితీ ఎన్నికల్లో ఎలాగోలా సానుభూతిని పొంది బయటపడదామా అని అనుకున్న ప్రణాళిక బెడిసి కొట్టినట్లు కనబడుతోంది.
సొంత పార్టీ టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా, తనకు మైలవరం నియోజకవర్గంలో తిరుగు లేదంటూ కాలర్ ఎగరేసిన ఉమాకు గ్రామీణ ప్రజలు ఓటుతో కొట్టి, ప్రజాస్వామ్య అసలు రుచిని చూపించారు. 2019 కల్లా పోలవరం పూర్తి అవుతుంది రాసుకోండి. దానిని సాధించేది మేమే వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటూ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా ప్రగల్భాలు పలికిన దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో వెలువడిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడ్డారు. సొంత గ్రామం గొల్లపూడి లోను రమారమి మెజారిటీతో బయటపడ్డారు. మిగిలిన అన్ని చోట్ల ఆయన పెట్టిన అభ్యర్థులకు ఘోర పరాభవం ఎదురైంది. మొదటి దశ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో టిడిపి అగ్రనాయకులు అని చెప్పుకునే నేతల్లో అత్యంత ఘోర వైఫల్యం దేవినేని ఉమాదే.
కాస్తలో క్లీన్ స్వీప్!
దేవినేని ఉమా గతంలో ప్రాతినిధ్యం వహించిన మైలవరం నియోజకవర్గం మొదటి దశ పంచాయతీ ఎన్నికల లోనే ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలో 10 పంచాయతీలు, జి.కొండూరు మండలం లో 22 పంచాయతీలు, మైలవరం పంచాయతీలో 13 పంచాయతీలు, విజయవాడ రూరల్ లో మూడు కలిపి మొత్తం మొదటిదశలో 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దీనిలో జి.కొండూరు లో మూడు మైలవరంలో ఒక పంచాయతీ మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 44 స్థానాలకు ఎన్నికలు జరిగితే దానిలో ఏకంగా నలభై రెండు స్థానాలను వైసిపి మద్దతు దారులు కైవసం చేసుకున్నారు. దేవినేని ఉమా సొంత గ్రామం గా భావించే గొల్లపూడి లో సైతం కేవలం అరవై ఓట్ల తేడాతోనే టిడిపి బలపరిచిన అభ్యర్థి గెలవడం విశేషం. మిగిలిన అన్ని చోట్ల భారీ తేడాతో వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు.
నాని మీద డ్రామా వర్క్ అవుట్ కాలేదు!
పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా కొత్త నాటకమాడి గట్టెక్కి పోదామని భావించిన దేవినేని ఉమా ప్రణాళిక వర్కవుట్ అవ్వలేదు. ఎన్నికల ముందు మంత్రి కొడాలి నాని తనను ఇష్టానుసారం దూషించారు అంటూ, మంత్రి కి సవాల్ విసురుతూ గొల్లపూడి సెంటర్ లో నిరాహార దీక్షకు దిగి కొత్త నాటకం రక్తి కట్టించాలని ఉమా చూసినప్పటికీ దానిని ప్రజలు ఎవరూ నమ్మలేదు. మంత్రి మీద విమర్శలు చేసి, నిరసనకు దిగిన సానుభూతి పొంది ఓట్లు పొందాలనుకున్న దేవినేని ఉమ ఎత్తుగడను గ్రామీణ ఓటర్లు పసిగట్టి నట్లే ఫలితాలను బట్టి కనిపించింది. ఆయన ముందు నుండి మరి అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేసి, పలువురు నాయకులకు గ్రామాల బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎన్నికల ఫలితాలు మాత్రం టీడీపీకి అనుకూల ఫలితాలు ఏమీ కనిపించకపోవడంతో గొల్లపూడి లో నిశ్శబ్దం అలముకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత దేవినేని ఉమా బయటకు రావడానికి కూడా సాహసించని పరిస్థితి ఏర్పడింది.
వసంత వ్యూహం పక్కాగా!
మైలవరం శాసనసభ్యుడిగా అన్ని గ్రామాలనూ పట్టించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకు అద్భుతమైన ఫలితాన్ని అందించి మరోసారి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నరు. టిడిపి బలంగా ఉన్న గ్రామాల్లో సైతం పక్కా వ్యూహరచన చేసి వైసిపి మద్దతుదారులను గెలిపించుకోవడంలో ఆయన కీలక పాత్రను తెరవెనుక నడిపించారు. మైలవరం మండలంలో టిడిపి మద్దతుదారులు, ఉమా అనుచరగణం ఉన్నప్పటికీ ఆ మండలంలో కీలకమైన వ్యక్తులను రాజకీయంలోకి తీసుకొచ్చి వారిని గెలిపించుకోవడం లోనూ ప్రత్యేకమైన కృషిని వసంత కృష్ణ ప్రసాద్ చేశారు. విజయవాడ అనుకొని ఉండే మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు వైసిపి పట్టు పెరగడం, మాజీ మంత్రి దేవినేని ఉమ ను సొంత పార్టీ నాయకులే నమ్మలేని పరిస్థితికి రావడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో టిడిపీ దిగజారుతుంది అని తెలియజేస్తుంది.