iDreamPost
iDreamPost
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి(ఎంవిఆర్ ) ఈ ఉదయం మరణించారు. చాలా కాలంగా ఎంవిఆర్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
ఎంబిబిఎస్ చదివిన ఎంవిఆర్ వామపక్ష ఉద్యమాలతో ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. తొలిరోజుల్లో కార్మిక సమస్యల మీద పోరాడిన ఎంవిఆర్ విరసం సంస్థతో కొంతకాలం పనిచేశారు .సాయుధపోరాటంలో తుపాకీ ఎవరు పట్టుకోవాలి?పెన్ను ఎవరు పట్టుకోవాలి?అన్న చర్చను లేపిన ఎంవిఆర్,ఉద్యమ చీలికలు తదితర కారణాలతో 1975 లో అనంతపురంలో జరిగిన విరసం సమావేశంలో రాజీనామా చేసి వామపక్షాఉద్యమాలతో దూరమయ్యి సొంత సిద్ధాంతంతో పనిచేశారు.
తెలుగుదేశం ఆవిర్భవంతో ఎంవిఆర్ ఆపార్టీలోచేరి 1983 ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచారు.1983లో మంత్రి పదవి వస్తుందని భావించినా ఎన్టీఆర్ రామామునిరెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు. వామపక్ష భావజాలం తో టీడీపీలో ఎక్కువ కాలం కొనసాగలేక ,తెలుగు గంగ మరియు ఇతర రాయలసీమ నీటి ప్రోజెక్టుల విషయంలో ఎన్టీఆర్ తో విభేదించి రాయలసీమ విమోచన సమితి ని ఏర్పాటు చేసి 18 రోజులు నిరాహార దీక్ష చేశారు.
తెలుగు గంగ ప్రాజెక్ట్ ను కేవలం చెన్నై తాగునీటి అవసరాలకోసమే డిజైన్ చేయటాన్ని ఎంవిఆర్ వ్యతిరేకించారు.కృష్ణా నీళ్లు రాయలసీమకు దక్కకుండా చెన్నై కి తీసుకు వెళ్లటాన్ని ఎంవిఆర్ వ్యతిరేకించారు. కృష్ణా నీళ్లు రాయలసీమకు దక్కాలని ఉద్యమించారు.
1985 ఎన్నికల్లో రాయలసీమ విమోచన సమితిని రాజకీయ పార్టీీ గా రిజిస్టర్ చేసి చాలా నియోజకవర్గాల్లో పోటీచేశారు. రాయలసీమ విమోచన సమితి తరుపున ప్రొద్దుటూరునుంచి పోటీ చేసిన ఎంవిఆర్ ఏడు వేల తేడాతో టీడీపీ అభ్యర్థి వరదరాజులు రెడ్డి మీద వోడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశ చెందకుండా రాయలసీమ నీటి ఉద్యమాన్ని అన్ని పక్షాలతో కలిసి ముందుకు తీసుకెళ్లారు. 1986 జనవరిలో జరిగిన చారిత్రక “కరువుబండ” యాత్రను రాయదుర్గం నుంచి పోతిరెడ్డిపాడు వరకు నిర్వహించారు. కరువు బండ యాత్ర ను లేపాక్షి నుంచి వైయస్సార్ ,తిరుపతి నుంచి మైసూరారెడ్డి, మదనపల్లి నుంచి భూమన్& చంద్రశేఖర్ రెడ్డి,మంత్రాలయం నుంచి బైరెడ్డి శేష శయనా రెడ్డి,కంభం నుంచి కందుల నాగార్జున రెడ్డి నిర్వహించారు. ఒక విధంగా రాయలసీమ నేతలకు నీటి పాఠాలు చెప్పిన గురువు ఎంవిఆర్. నీటి సాధన ఎంవిఆర్. ఇచ్చిన స్ఫూర్తి నేటికీ ఏదోఒక రూపంలో పనిచేస్తూనే ఉంది.
తరువాత రోజుల్లో వర్గ రాజకీయాల్లో ఇరుక్కొని కొంత కాలం జైల్లో ఉండి వచ్చిన ఎంవిఆర్.తిరిగి టీడీపీ తరుపున రెండు మూడుసార్లు పోటీచేసిన గెలవలేకపోయారు. ఎంవిఆర్. కొడుకు ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఎంవిఆర్. ఏ పార్టీలో స్వయంగా చేరనప్పటికీ కుటుంబం వైసీపీ లో ఉన్నది.
ఎంవిఆర్ గత పాతిక సంవత్సరాలుగా సాహిత్యం మీద ఎక్కువ దృష్టిపెట్టారు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారం మీద పదుల కొద్దీ వ్యాసాలు రాశారు. టూకీగా ప్రపంచ చరిత్ర,చివరికు మిగిలింది (Gone With The Wind ట్రాన్సలేషన్ ) ,పెద్దపులి ఆత్మకథ,రెక్కలు చాచిన పంజరం, శంఖారావం ఇలా అనేక పుస్తకాలు రాశారు.
ఎంవిఆర్ ముద్ర రాజకీయాల ,సాహిత్యం మరియు నీటి రంగం మీద శాశ్వతంగా ఉంటుంది. ఈ ఉదయం మరణించిన ఎంవిఆర్ కు నివాళి.