iDreamPost
iDreamPost
పిడుగుకి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు ఉంది బీజేపీ నాయకుల వైఖరి. వారికి అచ్చివచ్చిన మతం కార్డునే అన్ని రాష్ట్రాల్లోనూ వాడి లబ్ధి పొందాలని చూస్తున్నారు. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ ఉద్దేశాన్ని బయట పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇస్లామిక్ ఫండమెంటల్ సంస్థ కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ అల్లర్లను కొందరు ప్రోత్సహిస్తున్నారని, దీనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ఏపీలో అశాంతి నెలకొందని, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై దృష్టి పెట్టకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఆత్మకూరు బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు కుట్రపన్నారని, ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
అందుకు ఉదాహరణ చూపగలరా?
ఇస్లామిక్ ఫండమెంటల్ సంస్థ కార్యకలాపాలు పెరిగాయని ఆరోపిస్తున్న మురళీధరన్ అందుకు కనీసం ఒక ఉదాహరణనైనా చూపగలరా? రాష్ట్రంలో మతాల మధ్య మారణహోమం జరిగిపోతున్నట్టు, అశాంతి నెలకొన్నట్టు వ్యాఖ్యానించేసి ప్రభుత్వంపై నిందలు వేయడం మతరాజకీయం కాక మరేమిటి అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గడచిన ఏడాదిన్నరగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న మిగిలిన పార్టీలు, పచ్చ మీడియా రాష్ట్రంలో మతచిచ్చుపెట్టాలని యత్నించినా ఫలితం లేకపోయింది. తిరుమలలో అన్యమత ప్రచారం, అంతర్వేదిలో రథం దగ్ధం, దేవతల, నాయకుల విగ్రహాల కూల్చివేత వంటి గొలుసుకట్టు ఘటనలతో రాష్ట్ర ప్రభుతాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజ్ఞత ముందు ప్రతిపక్షాల ఎత్తులు పారలేదని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు.
అయినా ఇంకా మతం మంటలనే రాజేయాలని బీజేపీ నేతలు ప్రయత్నించడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అంటున్నారు. నిజంగా ఇస్లామిక్ ఫండమెంటల్ సంస్థ కార్యకలాపాలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులపై కనీస అవగాహన లేకుండా మతం వంటి సున్నిత అంశంపై కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ఆయన ఆ పని చూసుకువెళ్లాలి కాని ప్రభుత్వంపై నిందలు వేయడం ఏమిటని అధికారపార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పాలనపై దృష్టి పెట్టకపోతే కేంద్రం ప్రశంసలు ఎలా వస్తాయి?
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టడంలేదని ఆరోపిస్తున్న మురళీధరన్.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తరచుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించడంపై ఏమంటారని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆర్‌బీఐ, నీతి ఆయోగ్, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలను మెచ్చుకున్న సంగతి కేంద్రమంత్రి కూడా అయిన మురళీధరన్‌కు తెలియదా? రాష్ట్ర పోలీసు శాఖ పనితీరుకు జాతీయ స్థాయిలో అవార్డులు వస్తుంటే ఇక్కడ అరాచక పాలన కొనసాగుతోందని విమర్శిస్తే ఎవరు నమ్ముతారని అడుగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ప్రజల మనుసులు గెలిచేలా పనులు చేయాలి కానీ ఇలా వారి మధ్య వైషమ్యాలు పెంచే యత్నాలు చేయడం తగదని వైఎస్సార్ సీపీ నేతలు హితవు చెబుతున్నారు.