iDreamPost
android-app
ios-app

TDP, Acham naidu – మైండ్‌ బ్లాంక్‌ అయిందా అచ్చెన్నా?

  • Published Nov 17, 2021 | 1:30 PM Updated Updated Nov 17, 2021 | 1:30 PM
TDP, Acham naidu – మైండ్‌ బ్లాంక్‌ అయిందా అచ్చెన్నా?

మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ కొట్టిన దెబ్బకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మైండ్‌ బ్లాంక్‌ అయిందా అన్న అనుమానం కలుగుతోంది.  అర్థం పర్థం లేని సవాళ్లు విసురుతూ ఇప్పటికే పరువు పోగొట్టుకున్న టీడీపీని మరింత నవ్వుల పాలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు నేపథ్యంలో అమరావతిలో బుధవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలట!

దమ్ముంటే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. మళ్లీ మీరు గెలిస్తే టీడీపీని మూసేస్తాం అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కుప్పంలో వైఎస్సార్‌ సీపీ గెలిచిన గెలుపు ఒక గెలుపా? అని ప్రశ్నించారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బొకేలు ఇచ్చు కోవడం దారుణమన్నారు. ఉట్టిని అందుకోలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టు ఉంది అచ్చెన్న వైఖరి. పంచాయతీ, పరిషత్‌, మున్సిపాలిటీ, ఉప ఎన్నికలు ఇలా వరుసగా ఎన్నిక ఏదైనా విజయఢంకా మోగిస్తున్న అధికార వైఎస్సార్‌ సీపీకి ఈ సవాల్‌ విసరడమే విడ్డూరం. గడచిన రెండున్నరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వకుండా, కొన్నిచోట్ల అసలు పోటీ చేయని టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు రావాలంటూ సవాల్‌ విసరడం ఏమిటో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ గెలిస్తే టీడీపీని మూసేస్తాం అని అచ్చెన్న వేరే చెప్పడం ఎందుకు ఇప్పుడు ఆ పార్టీ మూసివేత దిశగానే అడుగులు వేస్తోంది కదా అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : YCP, Nellore Corporation – సింహపురిలో జూలువిదిల్చిన వైసీపీ.. పత్తాలేకుండా పోయిన టీడీపీ

దొంగ ఓట్లకు అవకాశం ఉందా..

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా అధికార పక్షంపై బురదజల్లడం ఎందుకు? దొంగ ఓట్లు వేశారని, అధికారులు వైఎస్సార్‌ సీపీకి సహకరించారని అడ్డగోలుగా విమర్శిస్తే జనం ఇచ్చిన తీర్పును అవమానించినట్టు కాదా? ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ దొంగ ఓట్లు వేయించిందని, తెలుగుదేశం అభ్యర్థులుగాని, పోలింగ్‌ ఏజెంట్లు కాని ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌, అచ్చెన్న లాంటి నాయకులే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఫొటోతో ఉన్న ఓటరు ఐడెంటిటీ కార్డు, ఓటరు జాబితా, ఆధార్‌కార్డుల పరిశీలన పూర్తి అయిన తరువాతే ఓటరును ఓటు వేసేందుకు అనుమతిస్తారు. వీటిలో ఏది సక్రమంగా లేకపోయినా టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చు. అలాంటి అభ్యంతరాలు ఎక్కడా రాలేదంటే ఎన్నికల్లో దొంగ ఓట్లకు అవకాశం లేదనే కదా అర్థం. మరలాంటప్పుడు అరిగి పోయిన గ్రామఫోన్‌ రికార్డులా దొంగ ఓట్లు అంటూ పదేపదే చేసే వ్యాఖ్యలకు విలువ ఉంటుందా అన్న వైఎస్సార్‌ సీపీ నేతల ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎందుకు సమాధానం చెప్పడం లేదు.

Also Read : Peddireddy, Kuppam Municipality Results – చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు.. పుంగనూరులో పోటీ చేయాలని ఆహ్వానం

పోరాడితే ఎందుకు ఓడిపోయారు?

టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నామని అచ్చెన్నాయుడు మరో వింత వ్యాఖ్య చేశారు. డీజీపీ లేకపోతే వైఎస్సార్‌ సీపీ గెలిచేది కాదని ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. టీడీపీ కార్యకర్తలు పోరాటాన్ని అభినందించడానికి వారు ఏమి చేశారని? అధికారులపై ఆరోపణలు, అర్థం లేని అల్లర్లు, రాద్ధాంతం తప్ప గెలుపు కోసం పాజిటివ్‌గా వ్యవహరించే అవకాశం వారికి పార్టీ నాయకత్వం ఇచ్చిందా? వైఎస్సార్‌ సీపీ గెలుపు నేపథ్యంలో అధికార పార్టీలోకి టీడీపీ నుంచి వలసలు జోరందుకుంటాయన్న భయంతో అచ్చెన్న ఇలా అంటున్నారని జనం భావిస్తున్నారు.

ఓటింగ్‌ పెరిగితే ఓడిపోవడమేమిటో..

టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోలేదని, ఏడు నెలల్లో టీడీపీకి 13 శాతం ఓటింగ్‌ పెరిగిందని, కొద్దిరోజుల్లో వైఎస్సార్‌ సీపీ నేతలకు చంద్రబాబు అసలు సినిమా చూపిస్తారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఏ పార్టీకి అయిన ఓటింగ్‌ శాతం పెరిగితే ఎందుకు ఇంత చిత్తుగా ఓడిపోతుంది. అసలు 13 శాతం ఓటింగ్‌ పెరిగిందని గాలి మాటగా చెప్పేయడమే తప్ప దానికి ఒక ఆధారం, ప్రామాణికత ఏమైనా ఉందా? కుప్పంలో ఘోర ఓటమితో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు అసలు సినిమా చూపిస్తారని వ్యాఖ్యనించడం జనం జోక్‌గా తీసుకుంటారని కూడా అనిపించడం లేదా? పార్టీ తరఫున తాను ఇన్‌చార్జిగా వ్యవహరించిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ సాధించడంపై బాధ్యత వహించి అచ్చెన్నాయుడు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే హుందాగా ఉండేది. అలాకాకుండా గెలిచిన పార్టీపై చిల్లర ఆరోపణలు చేస్తే జనం ముందు ఇంకా చులకన అవడం తప్ప ప్రయోజనం ఉండదు.

Also Read : Kuppam Municipality Results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ