iDreamPost
iDreamPost
రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యింది. పగడ్భందీ ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గం.ల నుంచి ఓట్ల లెక్కింపు మొదలెట్టారు. 11 మునిసిపల్ కార్పోరేషన్లు, 70 మునిసిపల్, నగర పంచాయితీల కౌంటిగ్ ప్రారంభమయ్యింది. ఏలూరు నగర పాలక సంస్థ, చిలకలూరిపేట మునిసిపాలిటీకి సంబంధించిన ఓట్ల లెక్కింపుని హైకోర్టు ఆదేశాలతో నిలిపేశారు. మాచర్ల, పుంగనూరు, పులివెందుల, పిడుగురాళ్ల మునిసిపాలిటీలు ఏకగ్రీవంగా వైసీపీ కైవసం చేసుకుంది.
ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. దాదాపుగా అన్ని మునిసిపాలిటీలలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పాలక వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ట్రెండ్స్ ని బట్టి తొలి దశలో వైఎస్సార్సీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లోనూ ప్రతీ మునిసిపాలిటీలోనూ ఆపార్టీకే ఆధిక్యం సాగిస్తోంది. దాంతో సంపూర్ణం ఆధిక్యం దక్కుతుందనే ఆశాభావంతో ఆపార్టీ ఉంది.
కీలకమైన విజయవాడ, జీవీఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు విపక్ష టీడీపీ ప్రయత్నించింది. జనసేన-బీజేపీ కూటమి ఉనికి చాటుకునే యత్నంలో ఉంది. ఇక లెఫ్ట్ కొన్ని సీట్లు గెలిచే అవకాశాలున్నా, కాంగ్రెస్ బోణీ కొడుతుందా లేదా అన్నది చర్చనీయాంశమే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈసారి ఫలితాల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే దానిపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఉదయం 10గం.ల సమయానికి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో కొంత జాప్యం జరిగినా మధ్యాహ్నం తర్వాత పూర్తి ఫలితాలు వెలువడతాయి. ఈనెల 18న మేయర్, చైర్ పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో గెలిచిన అభ్యర్థులంతా ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. తొలి పరీక్షలో విజయం సాధించిన తర్వాత తదుపరి ప్రయత్నాల కోసం వేచి చూస్తున్నారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ సాగుతోంది