iDreamPost
iDreamPost
రాష్ట్రంలో ఇటీవల జరిగిన నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమాన సీట్లు వచ్చి.. ఉత్కంఠ రేపిన కొండపల్లి ఎన్నికలు మాత్రం వాయిదా పడ్డాయి. దర్శి మున్సిపాలిటీ మినహా నెల్లూరు కార్పొరేషన్ సహా మిగిలిన 10 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
నెల్లూరు మేయరుగా స్రవంతి
ఎన్నికలు జరిగిన ఏకైక నగరపాలక సంస్థ నెల్లూరు మేయరుగా ఎస్టీ వర్గానికి చెందిన పొట్లూరి స్రవంతిని వైఎస్సార్సీపీ ఎంపిక చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్లుగా అదే పార్టీకి చెందిన రూప్ కుమార్ యాదవ్, సలీం అహ్మద్ ఎన్నికయ్యారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 54 డివిజన్లను అధికార వైఎస్సార్సీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న కొండపల్లి ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడటంతో.. ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మున్సిపాలిటీలో 29 వార్డులకు గాను వైఎస్సార్సీపీ, టీడీపీ చెరో 14 వార్డుల్లో గెలిచాయి. టీడీపీ రెబెల్ మరో వార్డులో నెగ్గారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. విజయవాడ ఎంపీ కేశినేని నానీ కోర్టు ద్వారా ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా చేరేందుకు అనుమతి పొందడం రెండు పార్టీల మధ్య వివాదానికి కారణం అయింది. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యంతరం లేవనెత్తారు. కోర్టును తప్పుదోవ పట్టించి కేశినేని అనుమతి తెచ్చుకున్నారని.. దాన్ని సరిదిద్దాల్సి ఉందన్నారు. అంతవరకు ఎన్నిక నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. దాంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
మిగిలిన మున్సిపాలిటీల్లో ఇలా..
-కర్నూలు జిల్లా బేతంచెర్ల చైర్మన్ గా సీహెచ్ చలం రెడ్డి, వైస్ చైర్మన్లుగా ఎం.పర్వేజ్, నాగ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.
-అనంతపురం జిల్లా పెనుకొండ చైర్మన్ గా ఉమర్ ఫరూక్, వైస్ చైర్మన్లుగా సునీల్, నందినీరెడ్డి పదవీ ప్రమాణం చేశారు.
-కడప జిల్లా రాజంపేట చైర్మన్ గా పోలా శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యక్షులుగా రవికుమార్, సుమియా ఎన్నికయ్యారు. అలాగే కమలాపురంలో చైర్మన్ గా మేరీ, వైస్ చైర్మన్లుగా సాదిక్, శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు.
-కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా రంగాపురం రవీంద్ర, ఉపాధ్యక్షులుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నీషా ఎన్నికయ్యారు.
-చిత్తూరు జిల్లా కుప్పం చైర్మన్ గా డాక్టర్ శ్రీధర్, వైస్ చైర్మన్లుగా హఫీజ్, మునిస్వామి పదవీ స్వీకారం చేశారు.
-పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ అధ్యక్షురాలిగా జామి హైమావతి, ఉపాధ్యక్షులుగా పుప్పాల సత్యనారాయణ, జ్యోత్స్నాదేవి ఎన్నికయ్యారు.
-గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా రమాదేవి, ఉపాధ్యక్షులుగా మస్తాన్ బీ, అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
Also Read : Kondapalli-కొండపల్లి నగర పంచాయతీలో ఏం జరుగుతోంది, టీడీపీలో ఆందోళన ఎందుకు