iDreamPost
iDreamPost
నిన్న మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రావడంతో ఆ హడావిడిలో బాక్సాఫీస్ ఉండిపోయింది కానీ మరో బాలీవుడ్ మూవీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మోసగాళ్లతో పాటు ఇదే రోజు కాజల్ అగర్వాల్ నటించిన బాలీవుడ్ చిత్రం ముంబై సాగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజయ్యింది. లాక్ డౌన్ తర్వాత చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న హిందీ సినిమా ఇప్పటిదాకా రాని తరుణంలో ఈ ముంబై సాగా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ నిర్మాతలు ధైర్యం చేసి థియేటర్లలో ముంబై సాగాని తీసుకొచ్చారు. మనవెలాగూ పోయాయి మరి దీని సంగతేంటో మినీ రిపోర్ట్ లో చూసేద్దాం
రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ మీద కాయగూరలు అమ్ముకునే అమర్త్య రావు(జాన్ అబ్రహం)కు తమ్ముడంటే ప్రాణం. తన కోసమే గొడవలకు పోకుండా సాధుజీవిలా బ్రతుకుతూ ఉంటాడు. గూండాయిజాన్ని ఎదిరించమని పదే పదే రెచ్చగొట్టే ప్రియురాలు(కాజల్ అగర్వాల్)కూడా ఉంటుంది. ఓసారి స్థానిక గూండా గైతొండే మనుషులు అమర్త్య తమ్ముడిని తీవ్రంగా గాయపరుస్తారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన అన్నయ్య వాళ్ళను ఊచకోత కోస్తాడు. ఇతని సత్తా తెలిసిన గైతొండే ప్రత్యర్థి భావు(మహేష్ మంజ్రేకర్)ఇతన్ని చేరదీస్తాడు. ఇంతింతై స్థాయిలో అమర్త్య తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు.
ముంబైలో పాతుకుపోయిన ఈ నేరసామ్రాజ్యాన్ని పెకలించే లక్ష్యంతో వచ్చిన పోలీస్ ఆఫీసర్ విజయ్ సావర్కర్(ఇమ్రాన్ హష్మీ)కి అమర్త్య కు యుద్ధం మొదలవుతుంది. చివరికి ఇది ఎక్కడికి చేరుకున్నది అనేదే రెండు గంటల ముంబై సాగా. కథతో సహా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. గతంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ ఛాయలు అడుగడుగునా కనిపిస్తాయి. దానికి తోడు సాగతీత కథనంతో పాటు హై అనిపించే ఎపిసోడ్లు పెద్దగా లేకపోవడంతో ముంబై సాగా ఆశించినంత కిక్ ఇవ్వదు. దర్శకుడు సంజయ్ గుప్తా రొటీన్ ఫార్ములాలో వెళ్ళిపోయాడు. మాఫియా క్రైమ్ డ్రామాలంటే విపరీతమైన పిచ్చి ఉంటే తప్ప ఇది యావరేజ్ గా అనిపించడం కూడా కష్టమే