iDreamPost
android-app
ios-app

మల్టీప్లెక్సుల్లో తప్పిన కళ – సింగల్ స్క్రీన్లు విలవిలా

  • Published Nov 06, 2020 | 10:21 AM Updated Updated Nov 06, 2020 | 10:21 AM
మల్టీప్లెక్సుల్లో తప్పిన కళ – సింగల్ స్క్రీన్లు విలవిలా

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాక కూడా థియేటర్లలో మునుపటి కళ కాదు కదా కనీసం అందులో పావు వంతు కూడా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి గురించి చెప్పేదేముంది. ఒకటి రెండు నగరాలు మినహాయించి మిగిలిన చోట్ల కనీసం గేట్లు తెరిచే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. దీపావళికి తెరుస్తారేమోనని ఎదురు చూసిన మూవీ లవర్స్ కు నిరాశ తప్పలేదు. తమిళనాడులో వచ్చే వారం నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చేశారు. అక్కడా పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఏ కొత్త సినిమానీ విడుదలకు సిద్ధంగా పెట్టలేదు. నిర్మాతలందరూ సైలెంట్ గానే ఉన్నారు.

ఇక దేశవ్యాప్తంగా తెరుచుకున్న మల్టీప్లెక్సుల సంగతి చూస్తే కలెక్షన్లు కనీసం మెయింటెన్స్ ఖర్చులకు సరిపోయేంత కూడా రావడం లేదు. పైపెచ్చు అదనపు భారం చాలా పడుతోంది. సరే ప్రేక్షకులను అలవాటు చేసేందుకు కొంత కాలం త్యాగం చేద్దామని ఆయా యాజమాన్యాలు సిద్ధపడినా ఎక్కువ రోజులు పాత సినిమాలతో నెట్టుకురావడం కష్టం. పట్టుమని షోకు పాతిక మంది కూడా రాలేని దారుణ పరిస్థితి నెలకొంది. అందులోనూ ఇటీవలి కాలంలో శాటిలైట్ ఛానల్స్ లో వచ్చిన సినిమాలనే ప్రదర్శిస్తుండటం ఇంకో మైనస్ గా మారింది. అందుకే బాలీవుడ్ లో కొంచెం వెనక్కు వెళ్లి బాహుబలి, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి క్లాసిక్స్ ని వేస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే స్టాఫ్ కు సరిపడా జీతాలిచ్చే సొమ్ము కూడా కలెక్షన్ల రూపంలో రాకపోతే మళ్ళీ మూయడం తప్ప వేరే మార్గం లేదని మల్టీప్లెక్స్ ఓనర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం 50 పెర్సెంట్ సీటింగ్ కు అనుమతి ఇవ్వడమే అన్ని చిక్కులకు కారణం. అందుకే ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న ప్రొడ్యూసర్లు కూడా డేట్ చెప్పేందుకు సాహసించడం లేదు. వాళ్ళ మనసులో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ చాలా ఉంది. ఒక్క తెలుగులోనే సుమారు పదికి పైగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అందరూ సంక్రాంతి అంటున్నారే తప్ప కనీసం క్రిస్మస్ ప్రస్తావన కూడా తేవడం లేదు. మరి ఇంకో నలభై రోజులకు పైగా ఈ గడ్డుకాలం కొనసాగక తప్పేలా లేదు.