iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్ లో ఫిరాయింపుల పర్వం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి జోరుగా వలసలు జరగడంతో కమలదళంలో కలవరం రేగింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలోకి జంప్ చేయడంతో సమాజ్వాదీ పార్టీలో జోష్ పెరిగింది. కానీ బీజేపీ దెబ్బకు దెబ్బ అన్నట్లు ఏకంగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం కుటుంబంలోనే చీలిక తేవడంలో విజయం సాధించింది. ఆయన చిన్న కోడలు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్ ను తన పార్టీలో చేర్చుకుంది. దీని వల్ల బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో గానీ ప్రతిపక్ష పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి మాత్రం పనికొస్తుంది.
సొంతింట్లోనే విఫలమయ్యారు…
గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ బుధవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశవ్ ప్రసాద్ మాట్లాడుతూ ములాయం కుటుంబం సొంత ఇంట్లోనే విఫలమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ పథకాలను తాము ప్రవేశపెట్టామని చెప్పుకోవడం తప్ప అఖిలేష్ యాదవ్ ఏమీ చేయలేదన్నారు. అపర్ణ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ భావజాలంతో ప్రభావితురాలినై ఆ పార్టీలో చేరానన్నారు. మోదీ, యోగిల పాలనా విధానం ఆకర్షించిందన్నారు.
Also Read : ములాయం చిన్న కోడలు బీజేపీలో చేరతారా?
కొన్నాళ్లుగా కుటుంబంలో విభేదాలు..
ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా కుమారుడు ప్రతీక యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్. 2017 ఎన్నికల్లో ఆమె లక్నోలోని కాంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ములాయం కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కొంతకాలంగా ఆమె బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతూ వచ్చారు. అయితే ములాయం నచ్చజెప్పడంతో ఎన్నికల్లో ఎస్పీ తరపున ప్రచారం చేస్తానని అపర్ణ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. కానీ అంతలోనే మనసు మార్చుకుని బీజేపీలో చేరిపోయారు. ఆమె బీజేపీ టికెట్ పై ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. బీజేపీ నాయకత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.
బీజేపీలోకి ఎస్పీ భావజాలం
అపర్ణ యాదవ్ బీజేపీలో చేరికపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ స్పందించారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ అవకాశం ఇస్తుండటం సంతోషకరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ భావజాలాన్ని అపర్ణ బీజేపీలో వ్యాప్తి చేస్తారని అన్నారు. ఆమె పార్టీ మారడం వల్ల తమ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని చెప్పారు.
Also Read : యూపీలో దీదీ అడుగు