ఫిబ్రవరి 25,1964న అమెరికా లోని, మియామీ బీచ్ కన్వెషన్ హాల్ ఎరీనాలో డిఫెండింగ్ ఛాంపియన్ సోనీ లిస్టన్ తో బాక్సింగ్ హెవీ వెయిట్ కేటగిరీలో తలపడనున్న 22 సంవత్సరాల యువకుడు కనీస పోటీ అయినా ఇవ్వగలడని ఎవరూ అనుకోలేదు. బెట్టింగ్ నిర్వహించే బుకీలు లిస్టన్ గెలుపు అవకాశాలు 8-1 అని ప్రకటించారు. అందుకు తగిన కారణం కూడా ఉంది. బాక్సింగ్ రింగ్ లోకి దిగితే భయంకరంగా పోరాడే సోనీ లిస్టన్ అంతకుముందు సంవత్సరమే అప్పటికి తిరుగులేని హెవీ వెయిట్ ఛాంపియన్ ఫ్లాయిడ్ పాటర్సన్ ని రెండు సార్లు మొదటి రౌండ్ లోనే చిత్తు చేశాడు.
తన గెలుపుమీద ఎవరికీ నమ్మకం లేకపోయినా ఇరవై రెండేళ్ల కాసియస్ క్లే మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాడు. పోరాటానికి ముందు రోజు జరిగిన విలేకరుల సమావేశంలో “సీతాకోకచిలుక లాగా గాలిలో తేలి, తేనెటీగ లాగా కుట్టి ఎనిమిది రౌండ్లలో లిస్టన్ ని నాకొట్ చేస్తాను” అని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ మాటలను అందరూ వట్టి ఢాంభికంగా కొట్టి పడేశారు.
8,300 మంది ప్రేక్షకులతో క్రిక్కిరిసిన హాలులో పోరాటం మొదలైన క్షణం నుంచే క్లే తన ఆధిక్యత ప్రదర్శించారు. పాదరసంలా కదులుతూ లిస్టన్ విసిరే ముష్టిఘాతాలకు అందకుండా, వీలు దొరికినప్పుడల్లా అతని తల మీద పంచ్ లు కురిపిస్తూ వచ్చాడు కాసియస్ క్లే. ఆరో రౌండ్ ముగిశాక విరామం తరువాత ఏడో రౌండ్ మొదలైనట్టు రిఫరీ గంట మోగిస్తే సోనీ లిస్టన్ బరిలోకి దిగలేదు. మొదటి రౌండులో బలంగా విసిరిన పంచ్ క్లేకి తగలకపోవడంతో ఎడమ భుజంలో మొదలైన నొప్పి ఆరు రౌండ్లలో బాగా ఎక్కువైనందువల్ల లిస్టన్ పోరాటం విరమించుకుంటున్నట్టు రిఫరీకి తెలియజేసాడు. దాంతో ఏడో రౌండులో టెక్నికల్ నాకౌట్ ద్వారా కాసియస్ క్లే గెలిచినట్టు ప్రకటించాడు రిఫరీ. ఎనిమిది రౌండ్లలో గెలుస్తానని ముందుగా చెప్పిన క్లే ఒక రౌండ్ ముందుగానే గెలిచాడు.
ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న సందరభంలో మాల్కమ్ ఎక్స్,మహ్మద్ ఆలీ మరో ఇద్దరు మిత్రుల ఆమధ్య జరిగిన సంభాషణ ఆధారంగా 2020లో వచ్చిన One Night in Miami సినిమా పేక్షకులను ఆకట్టుకుంది.
పేదరికంలో గడిచిన బాల్యం
అమెరికా, కెంటకీ రాష్ట్రంలోని లూయీవిల్లెలో 1942లో జన్మించిన కాసియస్ మార్సెరియస్ క్లే బాల్యం పేదరికంలో గడిచింది. క్లే పూర్వీకులు ఆఫ్రికా నుంచి అమెరికా వచ్చిన బానిసలు. అటువంటి నేపధ్యం ఉన్న కొందరు నల్లజాతి బాలురులాగా నేర ప్రవృత్తి అలవరచుకోకుండా పన్నెండవ ఏట బాక్సింగ్ బరిలోకి దిగి, పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే సరికి వంద పోటీలు, గెలిచి గోల్డెన్ గ్లవ్స్ హెవీ వెయిట్ టైటిల్ తో సహా, 1960లో రోమ్ ఒలింపిక్స్ లో లైట్ హెవీ వెయిట్ విభాగంలో బంగారు పతకం గెలిచాడు.
ఒలింపిక్స్ విజయం తర్వాత ప్రొఫెషనల్ గా మారిన క్లే వరుసగా పంతొమ్మిది పోటీల్లో గెలిచి, అప్పటి హెవీ వెయిట్ ఛాంపియన్ సోనీ లిస్టన్ తో టైటిల్ కోసం పోరాడే అర్హత సంపాదించాడు.
మహమ్మద్ అలీగా పేరు మార్పు
లిస్టన్ మీద విజయం సాధించిన తర్వాత మియామీలోని ఒక స్టార్ హోటల్ లో సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు కాసియస్ క్లే. దానికి వివాదాస్పద నేషన్ ఆఫ్ ఇస్లాం సంస్థ అధ్యక్షుడు మాల్కమ్ ఎక్స్ హాజరయ్యాడు. ఈ సంస్థ నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడే అతివాద సంస్థ. ఆ తరువాత కొన్ని రోజులకు తను కూడా ఆ సంస్థలో చేరుతున్నట్టు, తన బానిస నేపధ్యాన్ని సూచించే పేరును మహమ్మద్ అలీగా మార్చుకొంటున్నట్టు ప్రకటించాడు.
వరుస విజయాలు – జైలు శిక్ష
సోనీ లిస్టన్ మీద విజయంతో మొదటిసారి హెవీ వెయిట్ ఛాంపియన్ అయిన మహమ్మద్ అలీ వరుసగా తొమ్మిది పోటీల్లో గెలిచి తన టైటిల్ నిలుపుకొన్నాడు. 1967లో వచ్చిన అమెరికా – వియత్నాం యుద్ధంలో భాగంగా సైన్యంలో చేరడానికి నిరాకరించాడు ఆలీ. ఆ యుద్ధం తన మనస్సాక్షికి సక్రమంగా అనిపించడం లేదు కాబట్టి సైన్యంలో చేరడానికి నిరాకరిస్తున్నాను అని చెప్పడంతో అయిదు సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యాడు. దీని మీద అప్పీలు చేయడంతో జైలుకి పోకుండా తప్పించుకోగలిగాడు కానీ మూడు సంవత్సరాలు బాక్సింగ్ రింగ్ లోకి దిగలేకపోయాడు. అయితే వియత్నాం యుద్ధం మీద మహమ్మద్ అలీ తీసుకున్న స్టాండ్ అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది.
1971లో అమెరికా సుప్రీంకోర్టు అతని శిక్ష రద్దు చేసింది. 1974లో ఆఫ్రికాలోనీ జైరే దేశంలో జరిగిన పోరాటంలో జార్జ్ ఫోర్ మన్ మీద తేలికగా నెగ్గినా, 1975లో జో ఫ్రేజియర్ తో జరిగిన పోరాటం పదిహేను రౌండ్లతో భయంకరంగా సాగింది. అందులో కూడా గెలిచి బాక్సింగ్ రంగంలో ఆల్ టైమ్ గ్రేట్ అని అభిమానులు, విమర్శకుల ప్రశంసలు పొందాడు. 1978లో లియోన్ స్పింక్స్ చేతిలో ఓడిపోయినా, అదే సంవత్సరం జరిగిన రిటర్న్ మ్యాచ్ లో అతన్ని ఓడించాడు. ఛాంపియన్ గా ఉండగానే 1979లో బాక్సింగ్ నుంచి రిటైరయ్యాడు ఆలీ.
భయంకరమైన వ్యాధి – అత్యున్నత పురస్కారాలు
తన పోరాటాలలో భాగంగా తలకు తగిలిన దెబ్బల కారణంగా 1984లో పార్కిన్ సన్స్ వ్యాధి బారిన పడిన మహమ్మద్ అలీలో శారీరకంగా, మానసికంగా చురుకుదనం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 1990లో మహమ్మద్ అలీ పేరును బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. 1996లో అమెరికాలోని అట్లాంటా నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో జ్యోతి ప్రజ్వలన కావించే గౌరవం ఇచ్చిన అమెరికా ప్రభుత్వం, 2005లో అధ్యక్షుడు నివాసం వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రధానం చేసి సత్కరించారు. క్రమేపీ క్షీణిస్తూ వచ్చిన ఆరోగ్యంతో మహమ్మద్ అలీ జూన్ 3,2016న మరణించాడు.