iDreamPost
android-app
ios-app

Mudragada, Cock Fight – కోడిపందేలు … ఈసారి ముద్రగడ వంతు

  • Published Dec 21, 2021 | 3:35 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Mudragada, Cock Fight – కోడిపందేలు … ఈసారి ముద్రగడ వంతు

సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడిపందేలు అంటేనే ఉభయ గోదావరి జిల్లాలు. పండుగ మూడు రోజులు పందేలు ఉంటేనే ఇక్కడ సంక్రాంతి సందడి వచ్చేది. పందేలు వద్దని కోర్టు ఆదేశాలు… జరగనిచ్చేది లేదని పోలీసుల హూంకరింపులు… చివరి నిమిషం వరకు ఉత్కంఠ.. ఆపై అనుమతి ఇవ్వకున్నా బహిరంగంగా కోడిపందేలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి, ఉగాది వంటి పండుగల సమయంలో కోడి పందేలతోపాటు ఎడ్లు, గుర్రం పందేలకు అనుమతి ఇవ్వాలని, ఇబ్బంది రాకుండా చూడాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి సోమవారం లేఖ రాయడం చర్చినీయాంశమైంది.

‘సంక్రాంతి.. ఉగాది పండుగలకు గ్రామాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు వంటి వాటికి ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలి’ అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగల సమయంలో కోడిపందేలతోపాటు ఎడ్లు, గుర్రం, కోడి పందేలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందేలు, ఆటల పోటీలు, జాతరలు తదితర వాటిని ఐదు రోజులు పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన లేఖలో గుర్తు చేశారు. ‘ఈ మధ్య కాలంలో పండుగల సమయంలో ప్రభుత్వ ఆదేశాలంటూ ఈ పందేలు జరగకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం, చివరిలో అనుమతి ఇవ్వడం వంటివి చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. అటువంటి ఇబ్బందులు రాకుండా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. పందేలకు అనుమతి ఇవ్వాలని ఉద్యమనేతగా ముద్రగడ లేఖ రాయడం కాస్త విడ్డూరమే అనిపించినా గోదావరి జిల్లాల సంస్కృతి తెలిసినవారికి ఇది సామాన్యమైన విషయంగానే అనిపిస్తోంది.

పందెం కోళ్లు పౌరుషానికి పెట్టింది పేరు. పల్నాటి యుద్ధం కోడిపందేల వల్లే మొదలైందంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేల్లో మూడు రోజులు కలిపి సుమారు రూ.వంద కోట్ల పందేలు జరుగుతాయని అంచనా. పందేల్లో అగ్రస్థానం భీమవరం, ఐ.భీమవరం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో జరిగే పందేల్లో నోట్ల కట్లలు తెగిపడుతుంటాయి. ఇక్కడ జరిగే పందేలకు రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున వస్తారు. తెలంగాణా నేతలు కూడా వచ్చి వాలిపోతారు. వీరే కాకుండా సినీ నటులు కూడా హజరవుతుంటారు. సంక్రాంతి వస్తుందంటే చాలు కోడిపందేలకు అనుమతి ఇవ్వాలని సామాన్యులే కాదు.. రాజకీయ నాయకుల సిఫార్సులు కూడా ఉంటాయి.

అసలు ఈ విషయంపై తొలిసారి గళమెత్తిన నేత కాకినాడ మాజీ ఎంపీ, పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత తోట గోపాలకృష్ణ. ఆయన ఏకంగా తూర్పు జిల్లా పరిషత్‌ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘కోడి పందేలకు పండుగ మూడు రోజులు అనుమతి ఇవ్వండి… అవసరమైతే మీరు తీర్మానం పెట్టండి, మేము ఏకగ్రీవంగా ఆమోదిస్తాం’ అని ఆయన కోరడం అప్పట్లో చర్చినీయాంశమైంది. తాజాగా ముద్రగడ తన వంతుగా లేఖరాయడం ఈసారి పండుగకు మూడు వారాల ముందే కోడిపందేల మీద చర్చమొదలైంది.