iDreamPost
android-app
ios-app

గోపీచంద్ ట్రిపుల్ హంగామా

  • Published Jun 21, 2021 | 6:08 AM Updated Updated Jun 21, 2021 | 6:08 AM
గోపీచంద్ ట్రిపుల్ హంగామా

అప్పుడెప్పుడో గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ అనే సినిమా ఒకటి మార్నింగ్ షో వేయబోతు ఆగిపోవడం అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆర్థిక కారణాల వల్ల రిలీజ్ రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మేశాక విడుదల నిలిచిపోయిన చిత్రంగా దీని తాలూకు చేదు జ్ఞాపకాలు వాళ్ళను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు బి గోపాల్-హీరోయిన్ నయనతార – మణిశర్మ సంగీతం లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ ఈ మూవీ ఏళ్ళ తరబడి ల్యాబులోనే మగ్గిపోతూ వస్తోంది. గత ఏడాది ఓటిటి రిలీజ్ అనుకున్నారు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎట్టకేలకు ఇవి ఒక ఒక కొలిక్కి వచ్చాయట.

థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో ఫస్ట్ బంచ్ లో వచ్చే పెద్ద హీరోల సినిమాల్లో ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ చేరిందని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న సమాచారం. ఆర్థిక ఇబ్బందులను దాటుకుని నిర్మాత రమేష్ స్వయంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారట. మాస్ కంటెంట్ ఉన్న చిత్రం కావడంతో మంచి వసూళ్లు రావొచ్చనే నమ్మకంతో ఉన్నట్టు తెలిసింది. అయితే ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అయ్యాక అందులో సూపర్ హిట్ సాంగ్ పల్లవిని టైటిల్ గా పెట్టుకున్న గోపిచంద్ కు హైప్ పరంగా అది కలిసొచ్చించి కానీ ఇలా ఆగిపోవడం మాత్రం బాధే

ఇప్పుడీ వార్త నిజమైతే రాబోయే ఆరు నెలల్లో గోపీచంద్ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సీటిమార్ రిలీజ్ విషయంలో క్లారిటీ లేనప్పటికీ మరోపక్కా పక్కా కమర్షియల్ షూటింగ్ ని వేగంగా పూర్తి చేసేందుకు దర్శకుడు మారుతీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలా  చూసుకున్నా ఈ మూడు ఈ ఏడాది రావడం ఖాయమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్క నితిన్ మాత్రమే 2021లో మూడు సినిమాలు రిలీజ్ చేసుకున్న ఘనత అందుకోగా ఇప్పుడు గోపీచంద్ కూడా తోడవుతాడు. అయినా అయిదారేళ్ళు ఆగిన సినిమా నిజంగా మేజిక్ చేయగలదా లేదా ప్రేక్షకులే చెప్పాలి. చూద్దాం