iDreamPost
android-app
ios-app

కత్తి మహేష్‌ది అకాల మరణం కాదా..? కుట్ర జరిగిందా..?

కత్తి మహేష్‌ది అకాల మరణం కాదా..? కుట్ర జరిగిందా..?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దాదాపు పక్షం రోజులపాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్‌ది సహజ మరణం కాదా..? ఆయనపై కుట్ర జరిగిందా..? శత్రువులు ఆయనపై కుట్ర చేశారా..? అనే సందేహాలు ఆయన్ను అభిమానించే వారు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కత్తి మహేష్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పీలేరు మండలం యల్లమందలో జరిగాయి.

కత్తి మహేష్‌ అంతిమ యాత్రలో పాల్గొన్న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ.. కత్తి మహేష్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది. రోడ్డు ప్రమాదంలో కారు కుడి భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న సురేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారుకు ఎడమవైపున కూర్చొన్న కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు మంద కృష్ణ మాదిగ.

ఎవరో కుట్ర పన్ని కత్తి మహేష్‌ను అంతమొందించారనేలా మందకృష్ణ మాదిగ మాటలున్నాయి. రెండు మూడేళ్లుగా కత్తి మహేష్‌ వివిధ అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో ఆయనకు శత్రువులు పెరిగారని మంద కృష్ణ మాదిగ అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఆయనపై దాడులు, పలు వివాదాస్పద ఘటనలు జరిగిన విషయం మంద కృష్ణ మాదిగ తాను వ్యక్తపరుస్తున్న అనుమానాలకు జత చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ కత్తి మహేష్‌ను అభిమానించే వారు.. ఆయన మరణంపై ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాల నేపథ్యంలో.. కత్తి మహేష్‌ మరణంపై సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : తుది దశకు ఇన్‌సైడర్‌ కేసు : సుప్రీం ముందు ఏపీ కీలక ప్రతిపాదనలు