ఒక 30 ఏళ్ల యువతి, ఇద్దరి బిడ్డల తల్లి, పెట్రోల్ మంటల్లో అరుస్తూ, ఏడుస్తూ నేలరాలిపోతే మనకు రావాల్సింది కన్నీళ్లా? రెవెన్యూ వ్యవస్థ మీద కోప ద్వేషాలా?విజయారెడ్డి అంటే ఒక్కరు కాదు…ఆమె చుట్టూ ఎంతోమంది ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు జీవితాంతం తల్లి లేకుండా జీవించాలి. భయంకరంగా కాలిపోయిన తల్లి మృతదేహాన్ని వాళ్లు మరచిపోగలరా? ఆమె భర్త, అమ్మానాన్న, స్నేహితులు, బంధువులు…అందరూ ఈ బాధను, భారాన్ని మోస్తూ బతకాలి.
విజయారెడ్డి అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది పక్కన పెడితే…రెవెన్యూలో అవినీతి ఉందనేది పాలు తెల్లగా ఉన్నాయన్నంత నిజం. ఆమె ఒక అవినీతి వ్యవస్థకు ప్రతినిధి.
పెట్రోల్ పోసిన సురేష్‌ది పైశాచికమా, ఉన్మాదమా అన్నది పక్కన పెడితే…అతనో రైతు. మన దేశంలో అవినీతికి పాల్పడ్డానికి ఏ మాత్రం అవకాశం లేని వాళ్లలో మొదటి వ్యక్తి రైతు.
అతనికి కల్తీ విత్తనం అమ్ముతారు. కల్తీ మందులు అమ్ముతారు. పంట చేతికొస్తే దళారులు, వడ్డీ వ్యాపారులు పీక్కు తింటారు. పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో తెలియని జూదం అతనిది. దీనికి తోడు రెవెన్యూ వాళ్లు అనేక లిటిగేషన్లు సర్టిఫికెట్ల పేరిట రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. డబ్బులిస్తే పనులు జరుగుతాయనేది పాత మాట. డబ్బులిచ్చి కూడా ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చావాలనేది కొత్తమాట. కడప, అనంతపురం జిల్లాల్లో అనేక గ్రామాల రైతులు తహసీల్దార్ ఆఫీసులో పని అంటే సద్ది కట్టుకుని బయల్దేరుతారు.
ఈ రెండు వ్యవస్థల మధ్య జరిగిన సంఘర్షణే విజయారెడ్డి బలిదానం. రెవెన్యూ వాళ్లది లంచం తీసుకోకుండా ఉండలేని స్థితి. అనేక రకాల ప్రభుత్వ భారాలను వాళ్లే మోయాలి. ఉదాహరణకు ఒక మంత్రి పర్యటనకు వస్తే టీ, బీస్కెట్లు, భోజనాల ఖర్చు రూ.20 వేలు అయ్యిందనకుంటే అది రెవెన్యూ వాళ్లు భరించాలి. దీన్ని వాళ్లు తమ జీతాల నుంచి ఇవ్వలేరు కదా? అందుకని డీలర్లు, రెవెన్యూ ఉద్యోగులు తలా ఇంత వేసుకుంటారు. దాని రికవరీకి జనం మీద పడుతారు. ఒక మంచి ప్లేస్ పోస్టింగ్ కావాలనుకుంటే నాయకులకు, అధికారులకు ఇవ్వాలి. ఆ డబ్బును జనం నుంచి పిండాలి.
ఉదాహరణకు ఒక రెవెన్యూ అధికారి నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ ప్రొటోకాల్ ఖర్చులకు అతని జీతమంతా అయిపోయి భార్యాబిడ్డల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. పైన ఉన్న తిమింగళాలు ఈ చేపలను ఆడిస్తుంటాయి. మనకు తెలియక చేపలపై ద్వేషం పెంచుకుంటాం.
రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టడం వల్ల ఆ వైరస్ అందరికీ సోకింది. ఉదాహరణకు పోలీస్ వ్యవస్థను తీసుకొందాం. బాగా ఆదాయం వచ్చే స్టేషన్లలో తిరుపతి ఈస్ట్‌పోలీస్ స్టేషన్ నెంబర్ ఒన్. దీని పరిధిలో తిరుపతిలో 80 శాతం హోటళ్లు, లాడ్జీలు, బార్లు ఉంటాయి. ఇక్కడ ఎస్ఐ పోస్టు కోసం లక్షల్లో ముడుపులు, భారీ పైరవీలు చేసుకుంటారు. ఈ స్టేషన్లలో ఇద్దరు కానిస్టేబుళ్ల పని ఏంటంటే నెల మామూళ్లు వసూళ్లు చేసుకొని రావడమే.
ఈ ఎస్ఐ ప్రధాన డ్యూటీ ఏంటంటే రాష్ర్ట నలుమూలల నుంచి పోలీసుబాసులు తమ బంధువులని, కుటుంబ సభ్యులని తిరుమల దర్శనానికి పంపితే వాళ్లని రిసీవ్ చేసుకొని స్థాయికి తగ్గట్టు మర్యాదలు చేయడం, వెహికల్ పెట్టి తిరుమలకు పంపడం.
తిరుమలలో పోలీసులు ఏం చేస్తారంటే తమ అతిథులకు గెస్ట్‌హౌస్ అరేంజ్ చేసి, స్వయంగా తీసుకెళ్లి దర్శనాలు చేయించి హారతి కూడా ఇప్పిస్తారు. ఈ బంధుగణం ఆర్భాటానికి వెంకటేశ్వరస్వామి కూడా ఎందుకైనా మంచిదని రెండు అడుగులు వెనక్కి వేస్తాడు.
దేవుడి దర్శనానికి వచ్చినవాళ్లు డబ్బు ఖర్చు చేయకుండా పోలీసులపై పడితే వాళ్లేం చేస్తారంటే తిరుమలలో దుకాణాలు, హాకర్ల నుంచి వసూళ్లు చేస్తారు. రోడ్డు మీద ఎండకి, గాలికి, వానకి, చలికి బాధపడుతూ సార్ టోపీలు, సార్ టీలు, సార్ బొమ్మలు కొనండి అని అరిచే ఆ వీధి వ్యాపారికి ఎప్పుడో తిక్కలేసి పోలీస్‌ను అతని లాఠీతోనే చావబాదాడనుకోండి, దీంట్లో పోలీస్ నేరస్తుడా, పోలీస్‌బాసులు నేరస్తులా?
విజయారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. కోట్ల రూపాయల భూమిపై రాజకీయ గద్దలు వాలకుండా ఉంటాయా? నాయకులు, అధికారుల్ని కాదనుకుని ఆమె అనుకున్నా కూడా పేద రైతుకి న్యాయం చేయలేదు. కానీ కనపడని శక్తులపై అతని కోపాన్ని చూపలేడు. ఫలితంగా ఆమె సజీవదహనమైంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడికి ఆగ్రహం రాకపోతేనే ఆశ్చర్యం. కానీ అతనికి కూడా ఆగ్రహించే హక్కు లేదు. ఓటుకు వెయ్యి, రెండువేలు తీసుకున్న అతను కూడా నేరస్తుడే. డబ్బులతో అధికారాన్ని కొన్నప్పుడు, ప్రజల్ని అమ్మడం న్యాయమే కదా?
విజయారెడ్డిపై నెగటివ్‌గా మాట్లాడేవాళ్లు ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచిస్తే మనం కూడా అగ్నిప్రవేశానికి అర్హులమే అని అర్థమవుతుంది.
ఈ పెట్రోల్ పొగ ఎంత దూరం పోతుందో తెలియదు. వాస్తవానికి ఇప్పుడున్న వాతావరణం జీవించడానికి భయపడేంత కలుషితమైపోయింది. నాయకులు నాలుగు గోడల మధ్య పిల్లి అనుకుని పులిని చావబాదుతున్నారు.
సర్కస్ కళ అంతరించిన తర్వాత ఇప్పుడు ఎవడికి వాడే పులి. రింగ్ మాస్టర్లని లెక్కచేసే కాలం పోయింది. జాగ్రత్త.