iDreamPost
android-app
ios-app

తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ దే పైచేయి, పీసీసీ సారధిగా ఎంపిక

  • Published Jun 26, 2021 | 3:48 PM Updated Updated Jun 26, 2021 | 3:48 PM
తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ దే పైచేయి, పీసీసీ సారధిగా ఎంపిక

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాల ప్రహసనం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని ఖారారు చేసింది. అధికారిక ప్రకటన చేసింది. గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత కొత్తగా అధ్యక్షుడి ఎంపిక విషయంలో పోటీ ఏర్పడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి వరకూ పట్టుబట్టడంతో రేవంత్ రెడ్డి నియామకం ఊగిసలాటలో పడింది. చివరకు సామాజిక సమీకరణాలతో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్కలో ఎవరో ఒకరికి పీఠం కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. కానీ చివరకు రేవంత్ రెడ్డి తనదే పై చేయి అని నిరూపించుకున్నారు. తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

రేవంత్ రెడ్డి గడిచిన రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. జెడ్పీటీసీ నుంచి ఎంపీ వరకూ ఎన్నికయ్యారు. తొలుతు టీడీపీలో కీలకంగా ఎదిగారు. చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని నేటికీ కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది. వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. కేసీఆర్ కి వ్యతిరేకంగా తెలంగాణాలో బలంగా గొంతు వినిపించే నేతగా గుర్తింపు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుంచి ప్రస్థానం ప్రారంభించి, ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజకీయంగా ఎదిగే క్రమంలో పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. నోటిదురుసుతో కొన్ని సార్లు సమస్యల పాలయ్యారు. అదే సమయంలో ఓటుకి నోటు వ్యవహారంలో నేరుగా వీడియో సాక్షిగా దొరికిపోయి జైలు పాలయ్యారు. కేసుల్లో ఇరుక్కున్నారు.

Also Read : సీఎం వైఖరి మారిందా..?

రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ పోస్టు కోసం పోటీ పడిన కోమటిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ మొదలయ్యింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం వైపు చూస్తున్నారు. ఆయనతో పాటుగా సోదరుడు వెంకటరెడ్డికూడా ఫిరాయించే అవకాశం ఉందనే ప్రచారం మొదలయ్యింది. ఏమయినా ఓవైపు కేసీఆర్ ని ఎదుర్కొంటూ మరోవైపు బీజేపీకి అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ గానే చెప్పాలి. విద్యార్థి దశలో ఏబీవీపీతో అనుబంధం ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీని కూడా ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రేవంత్ టీమ్ ఎంపికలో కాంగ్రెస్ పెద్ద కసరత్తులే చేసింది. సామాజిక తూకాన్ని పాటించినట్టు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా మైనార్టీల నుంచి మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ , ఎస్సీల నుంచి మాజీ మంత్రి జే గీతారెడ్డి, బీసీల తరుపున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి కూడా ఛాన్స్ వచ్చింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ గా సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షట్కర్, వేం నరేందర్ రెడ్డి, పొడెం వీరయ్య, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, కుమార్ రావు టీ. జావెద్ అమీర్ ఎంపికయ్యారు. రెండేళ్లలో ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణంలో రేవంత్ రెడ్డికి కఠిన సవాల్ తప్పదని చెప్పవచ్చు.

Also Read : జగన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, చీఫ్ సెక్రటరీ విషయంలో క్లారిటీ