iDreamPost
iDreamPost
దోపిడీకి అనేకానేక మార్గాలు. మోసం చేసేవాడికంటే మోసపోయేవాడిదే తప్పంటూ ఒక వాదన కూడా ఉంటుంది. ఇలా ఎందుకు చెబుతారంటే మనం మోసపోయేలాంటి అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాద్యత మనమైనే ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా అన్నీ ఆన్‌లైనే, సర్వం ఆన్‌లైన్ అనే స్థాయికి ప్రపంచం చేరుకుంది. సామాన్య జనానికి ఇది పూర్తిగా కొత్తదైన ప్రపంచం. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా వ్యవహరాలు నడుపుకోవాల్సిన ఆగత్యం ఉండడంతో, అరకొర పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే అదనుగా కాచుక్కూర్చునే వ్యక్తులు ప్రజలను దోచుకునేందుకు పథకాలు సిద్ధం చేసుకుని కార్యరంగంలోకి దూకేస్తున్నారు.
ఇందులో భాగంగా ఫోనుల్లో రకరాల ఆఫర్లు చెప్పడం, అక్కడకు, ఇక్కడకు రండి మీకు ఆ గిఫ్టు వచ్చింది, ఈ గిఫ్టు వచ్చింది అంటూ ఊరించడం, మీరు ఫలానా పథకానికి అర్హులయ్యారు, దీని కోసం కొంత మొత్తం చెల్లించాలి అంటూ ఆశపెట్టడం, మీరు ఆన్‌లైన్ లాటరీ గెల్చుకున్నారు లాంటివి ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జనసామాన్యాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్న ఆన్‌లైన్ మోసగాళ్ళు తమ పంథాను విస్తృతపరిచి, ప్రజా ప్రతినిధులను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులను ఈ విధంగా బుట్టలో పెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు ఈ వీరి ఉచ్చులో పడి డబ్బులు నష్టపోయి కిమ్మనకుండా కూర్చోగా, మరికొందరు పోలీస్‌లను ఆశ్రయించి, మరొకరు ఈ విధంగా మోసపోకుండా తమ వంతు ఆధ్యతను నెరవేర్చారు.
అయితే ఇక్కడ అప్రమత్తతే అన్ని వేళలా రక్షగా ఉంటుందన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే తెలంగాణా రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు కే. కేశవరావు, ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీలు మోసగాళ్ళ భారిన పడకుండా తప్పించుకోగలిగారు. ఈ ఇద్దరు నాయకులకు దాదాపు ఒకే విధమైన పథకం పేర్లు చెప్పి మోసగాళ్ళ నుంచి ఫోన్లు రావడం గమనార్హం. ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ పథకం పేరు చెప్పడం, భారీ మొత్తం రుణం ఉందనడం, అందులో సగానికిపైగా సబ్సిడీగా వస్తుందని ఊరించడం వంటివి వీరిద్దరి విషయంలోనూ జరిగింది. అయితే అప్రమత్తమైన వీరు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే పోలీస్‌లకు విషయం తెలియజేసి, ఆన్‌లైన్ మోసగాళ్ళ జాడ కోసం వేట మొదలు పెట్టారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటి ప్రజాప్రతినిధులిద్దరూ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి మోసగాళ్ళ గేలానికి చిక్కలేదు. లేకపోతే మోసగాళ్ళ చేతుల్లో బాధితుల మాదిరిగానే బాధపడుతూ ఉండాల్సి వచ్చేది. ఇది ప్రజాప్రతినిధులకేకాక సామాన్యులకు కూడా వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో జరిగే ప్రతి కార్యకలాపంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఊరకనే ఆన్‌లైన్‌లో ఎటువంటి ప్రయోజనాని ఇతరులకు ఇచ్చేందుకు ఎవ్వరూ సిద్ధంగా ఉండరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.