iDreamPost
android-app
ios-app

New districts- కొత్త జిల్లాలు ఎన్ని? ఎప్పుడు? సీఎం ప్రకటన తర్వాత మరోసారి చర్చ

  • Published Nov 28, 2021 | 3:48 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
New districts- కొత్త జిల్లాలు ఎన్ని? ఎప్పుడు? సీఎం ప్రకటన తర్వాత మరోసారి చర్చ

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. గడిచిన ఏడేళ్లుగా ఈ అంశం నలుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం దానిని విస్మరించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఓ ప్రయత్నం చేసింది. 13 జిల్లాలుగా ఉండడం శుభసంకేతం కాదంటూ 14వ జిల్లా ఏర్పాటు చేయాలని యోచించింది. తెలంగాణా నుంచి ఏపీలో విలీనమయిన ఆరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం, రంపచోడవరం ఏజన్సీ మండలాలను కలుపుకుని జిల్లా చేయాలని సంకల్పించి ఓ అడుగు వేసింది. కానీ అంతలోనే ఆ ప్రతిపాదన విరమించుకుంది.

జగన్ మాత్రం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అంతకుముందు నుంచి వైఎస్సార్సీపీ విధాన నిర్ణయంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లాగా మార్చాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతో అధికారంలోకి రాగానే జిల్లాల విభజన యోచన చేసినప్పటికీ దానికి కేంద్రం కొర్రీలు వేసింది. ముఖ్యంగా జనగణన జరగాల్సి ఉన్న తరుణంలో రెవెన్యూ సరిహద్దులు మార్చవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గడంతో గడిచిన రెండేళ్లుగా ఈ వ్యవహారం నలుగుతూ వస్తోంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం 2011 జనగణన విషయంలో పూర్తి క్లారిటీకి రాకపోవడంతో ఈలోగా జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. కొత్త జిల్లాల విషయంలో తెలంగాణా ఏకంగా 10 నుంచి 31కి పెంచుకోగా ఏపీ మాత్రం అదే రీతిలో ఉండిపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు రావడం లేదనే అభిప్రాయం ఉంది. జిల్లాల వారీగా దక్కే కేటాయింపుల్లో ఏపీకి కొంత నష్టం జరుగుతోంది. అదే సమయంలో పాలనా పరంగా మరింత సౌఖ్యంగా ఉండేందుకు గానూ జిల్లాల విభజనకు జగన్ మొగ్గుచూపుతున్నారు.

ఇప్పటికే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలను 25 జిల్లాలుగా చేయాలనే ఆలోచన ఉంది. అయితే అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని గిరిజన ప్రాంతం విశాలంగా ఉండడంతో పాడేరు లేదా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా వచ్చింది. సంఖ్య ఎంతన్నది ఖరారు కాకపోయినా జిల్లాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక కసరత్తులు చేసింది. ఆయా జిల్లాల కేంద్రాలుగా అనుకుంటున్న చోట్ల ఉన్న మౌలిక సదుపాయాల వివరాలను సేకరించింది. దాంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త జిల్లాల ఏర్పాటు వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ సహా ఇతర ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.