Idream media
Idream media
సీఎం కేసీఆర్ సడెన్ గా మార్పు వచ్చిందని ఇప్పుడూ అందరూ గుర్తిస్తున్నారు. అది ఎంతలా అంటే.. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ కి చెందిన నేతలు కూడా ప్రశంసించే అంత. ఇటీవల కాలంలో కేసీఆర్ చేస్తున్న రాజకీయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు జనాల్లో తిరుగుతూనే మరోవైపు ప్రతిపక్ష నేతలతో సైతం సమావేశాలు జరుపుతున్నారు. సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. దాద్రిలో లాకప్ డెత్ కు గురైన దళిత మహిళ మరియమ్మ విషయంలో కేసీఆర్ స్పందించిన తీరు.. తాజాగా సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి సంబంధించి ప్రగతి భవన్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. తమ పార్టీ తరుఫున ఎవరూ హాజరు కారని తెలిపింది. అయినా బీజేపీని ధిక్కరించి ఓ సీనియర్ నేత కేసీఆర్ మీటింగ్ కు వెళ్లడం సంచలనమైంది. బీజేపీ వద్దన్నా కూడా బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.
దీనిపై బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు. సమాచారం లోపం ఏమీ లేదని.. సీఎం కేసీఆర్ సమావేశానికి బీజేపీ వద్దన్నా ఆయన వెళ్లాడని.. అలా వెళ్లకుండా ఉండాల్సింది అని వివేక్ చెప్పుకొచ్చారు. అఖిలపక్షానికి వెళ్లిన మోత్కుపల్లి దళితులకు కేసీఆర్ చేసిన అన్యాయం గురించి ప్రశ్నించే బాగుండునని అన్నారు.
వివేక్ అలా అంటే మోత్కుపల్లి మాత్రం కేసీఆర్ ను ప్రశ్నించడం కాదు.. ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మోత్కుపల్లి మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని.. మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజంలో మానసిక ఉత్తేజం కలిగించింది.. అందరకు మీకు ధన్యవాదులు అని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరారు
దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించిన మోత్కుపల్లి నర్సింహులు… ఇక, యాదగిరిగుట్టను, ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు..
గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు.. కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకం అన్నారు.. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు మోత్కుపల్లి. కాగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి వెళ్లాల్సింది కాదని.. పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు తెలుసు.. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వివేక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి హాజరు కావడం.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం ఆస్తికరంగా మారింది.