iDreamPost
iDreamPost
ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైనా మంచి ఉద్దేశంతో చేపట్టి కార్యక్రమాలను కూడా ఆచరణలో నీరు గారిపోతుండడం దానికి కారణంగా చెబుతున్నారు. ప్రజలను పలు అవస్థలు పాలుజేసేందుకు తోడ్పడడమే తప్ప సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు అనుభవాలను అనేక మంది ప్రస్తావిస్తున్నారు. సీఏఏ విషయంలో తొందరపాటుని వేలెత్తి చూపుతున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు కూడా ప్రస్తావిస్తున్నారు.
దేశమంతా లాక్ డౌన్ కారణంగా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. పరిశ్రమలు, సంస్థలు మూతపడడంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. దాంతో వలస కూలీల పరిస్థితి అస్తవ్యస్తం అయ్యింది. ఉన్న వారిలో ఉండాలా లేక సొంత గ్రామాలకు వెళ్లాలా అనే విషయంలో సందిగ్దం ఏర్పడింది. చివరకు అనేక చోట్ల పోలీసు ఆంక్షలను అధగమించి రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణా- ఆంద్రా సరిహద్దుల్లో తలెత్తిన తలనొప్పులు పూర్తిగా సమసిపోలేదు. నిత్యం అనేక మంది బోర్డర్ లో ఉన్న పోలీసులకు పెద్ద పరీక్షగా మారుతున్నారు
వాటిని మించి ఢిల్లీ ఆనంద్ విహార్ లో శనివారం నాటి దృశ్యాలు అందరినీ నివ్వెర పరిచాయి. ఎంత కష్టమొచ్చినా ఓర్చుకుని అనేక మంది ఇంటి గడప దాటి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ప్రధాని చెప్పినట్టు లక్ష్మణరేఖను అనుసరిస్తున్నారు. కానీ నిన్న హఠాత్తుగా వేల మంది ఒక్కసారిగా రోడ్డెక్కిన తర్వాత దేశంలో పరిస్థితి అదుపు తప్పుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. దాదాపుగా అందరూ వలస కూలీలే. దేశరాజధానిలో వివిధ పనులు చేసుకుంటూ పొట్ట నింపుకోవడానికి యూపీ, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఒక్కసారిగా సొంత రాష్ట్రాలకు వెనుదిరగారు. ఆ సందర్భంగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు అనుసరించాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా పరిణామాలున్నాయి. ఒకేసారి రోడ్డెక్కిన వారంతా మూకుమ్మడిగా సొంత ప్రాంతాలకు తరలిపోతున్న తీరు చూసిన వారంతా కలత చెందుతున్నారు.
కరోనా వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ పాటించి, ప్రతీ ఒక్కరూ ఎడం పాటించాలని సూచించినా దానికి భిన్నంగా ఎగబడిన తర్వాత ఒక కరోనా వ్యాప్తి చెందకుండా ఎలా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటి వరకూ హై ఫై సొసైటీ, కేవలం విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి మాత్రకే కరోనా ప్రభావం ఉంటుందని భావిస్తే తాజాగా కాంటాక్ట్ కేసులు వేగంగా పెరుగుతున్న తీరు కలవరపరుస్తోది. అదే సమయంలో ముంబై స్లమ్స్ లో కరోనా కేసులు రిజిస్టర్ కావడం మరింత ఆందోళనకరంగా మారబోతోందనే అభిప్రాయానికి కారణం అవుతోంది. అలాంటి సమయంలో అటు కేజ్రీవాల్, ఇటు మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎలాంటి ముప్పు పొంచి ఉందో అనేది అంతుబట్టడం లేదు.
ఇప్పటికే అనేక కీలక నిర్ణయాల సందర్భంలో ప్రకటనలకు, ఆచరణలకు పొంతనలేదన్నట్టుగా సాగిన మోడీ ప్రభుత్వ తీరు మరోసారి లాక్ డౌన్ తర్వాత కనిపిస్తున్న దృశ్యాలకు దర్పణం పడుతోంది. కేవలం ప్రకటనలే తప్ప దానికి తగ్గట్టుగా కార్యాచరణ లోపిస్తుందనే వాదన ఉంది.ముఖ్యంగా వలస కూలీలను ఆదుకునేందుకు, వారు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సి ఉంది. కానీ ఆర్థిక శాఖ నుంచి వచ్చిన ప్యాకేజీ అరకొరగా ఉండడంతో ఇక తమను ప్రభుత్వాలు ఆదుకునే అవకాశం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుమీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మహమ్మారిని ఒంటరి చేసే ప్రయత్నం వ్యర్థం అవుతున్నట్టు అర్థం అవుతోంది. దాంతో కేంద్రం మరింత పగడ్బందీగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమయ్యిందనే అభిప్రాయం బలపడుతోంది.