21 ఫిబ్రవరి, 1848న లండన్ నగరంలో ఒక జర్మన్ రచించిన గ్రంథం ప్రచురితమైనప్పుడు దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ ఆ తరువాత 170 సంవత్సరాలు గడిచినా ఆ గ్రంథంలో ఉన్న విషయం ప్రపంచంలో ఎక్కడో చోట తన ప్రభావాన్ని నేటికీ చూపిస్తూ ఉంది. ఆ గ్రంధమే కార్ల్ మార్క్స్ తన స్నేహితుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ తో కలిసి రచించిన కమ్యూనిస్టు మానిఫెస్టో. శ్రామిక వర్గానికి చెందిన ప్రజలు ఏకమై పెట్టుబడీదారి వర్గాల మీద విజయం సాధించడానికి అవసరమైన రూట్ మ్యాప్ కార్ల్ మార్క్స్ తన గ్రంథంలో సూచించాడు. మార్క్స్ తను జీవించి ఉండగా తాను కోరుకున్న మార్పులు చూడలేకపోయినా వంద సంవత్సరాల తర్వాత 1950 నాటికి ప్రపంచంలో సగభాగం కమ్యూనిస్టు పాలనలోకి వచ్చింది.
1818లో యూదు కుటుంబంలో పుట్టిన కార్ల్ మార్క్స్ ఫిలాసఫీలో పట్టా పొంది క్రైస్తవంలోని లూధరన్ శాఖలోకి తన మతం మార్చుకుని1843లో కలోన్ నగరంలోని ఒక పత్రికా సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేసి, ప్రభుత్వం పట్ల తీవ్రమైన విమర్శలు చేయడంతో ఆ పత్రిక నిషేధానికి కారణమయ్యాడు. అప్పుడు మార్క్స్ తన మకాం సోషలిస్టు వర్గాలకు రాజధానిగా ఉన్న పారిస్ చేరుకుని, సోషలిస్టు భావాలకు తన ఆలోచనలు జోడించి, శ్రామిక వర్గాలను సాయుధ తిరుగుబాటు వైపు మళ్ళేలా కమ్యూనిస్టు భావాలకు బీజాలు వేశాడు. ఇక్కడే అతనికి భావసారూప్యం ఉన్న ఫ్రెడరిక్ ఎంగెల్స్ తోడయ్యాడు. వీరిద్దరి బంధం చివరివరకూ కొనసాగింది.
దేశ బహిష్కరణ
మార్క్స్ భావాలను సహించలేని ఫ్రాన్స్ ప్రభుత్వం అతన్ని 1845లో దేశ బహిష్కరణ చేసింది. అప్పుడు స్నేహితులు ఇద్దరూ బెల్జియం లోని బ్రస్సెల్స్ నగరం చేరారు. రెండు సంవత్సరాలు ఎంగెల్స్ తో కలిసి మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి మెరుగులు దిద్దాడు. ఈ రెండు సందర్భాల్లో వివిధ వేదికల మీద తన భావాలను గట్టిగా చెప్పడంతో లండన్ నగరంలోని శ్రామిక వర్గానికి చెందిన లీగ్ ఆఫ్ ది జస్ట్ అనే సంస్థ తమతో కలిసి పని చేయవలసిందిగా మార్క్స్ ని ఆహ్వానించింది. ఎంగెల్స్ తో కలిసి తన మకాన్ని లండన్ నగరానికి మార్చిన మార్క్స్ ఆ సంస్థకు దిశానిర్దేశం చేసి, సంస్థ పేరును కమ్యూనిస్టు లీగ్ గా మార్చి, యూరప్ లో అన్ని శ్రామికవర్గ పార్టీలను ఏకం చేసే లక్ష్యంతో ఎంగెల్స్ తో కలిసి బ్రస్సెల్స్ చేరుకున్నాడు.
వర్గ పోరాటంలో పెట్టుబడీదారి వర్గం మీద శ్రామికవర్గాలకు కరదీపిక లాంటి మానిఫెస్టో తయారు చేయాలని సంకల్పించిన కార్ల్ మార్క్స్ 1847లో కమ్యూనిస్టు లీగ్ కోసం ఎంగెల్స్ రూపొందించిన నమూనా ఆధారంగా కమ్యూనిస్టు మానిఫెస్టో రూపొందించి 1848 ఫిబ్రవరి మొదట్లో లండన్ లోని కమ్యూనిస్టు లీగ్ వారికి పంపించాడు. లీగ్ నాయకులు దాన్ని ఆమోదించి, ప్రచురించి ఫిబ్రవరి 21న ప్రపంచం ముందు ఉంచారు. “యూరప్ లోని పెట్టుబడీదారి ప్రభుత్వాలు కమ్యూనిజాన్ని చూసి భయపడుతున్నాయి” అని అన్న వాక్యంతో మొదలైన ఈ గ్రంధం “ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే మీకు పోయేదేమీ లేదు మీకున్న సంకెళ్లు తప్ప” అనే బాగా ప్రాచుర్యం పొందిన వాక్యంతో ముగుస్తుంది.
మరుసటి రోజే మొదలైన విప్లవం
కాకతాళీయంగా ఫిబ్రవరి 22, 1848న సోషలిస్టు శక్తుల నేతృత్వంలో ఫ్రాన్స్ రాజరికానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలై, ఫ్రాన్స్ రాజు ఫిలిప్ పదవీచ్యుతుడై రిపబ్లిక్ ఏర్పాటుకి దారితీసింది. ఈ ఉద్యమాలు యూరప్ లో ఆస్ట్రియా, హంగరీ, పోలాండ్, డెన్మార్క్ లాంటి ఇతర దేశాలకు పాకినా సంవత్సరం ముగిసేలోగా పెద్దగా రాజకీయపరమైన మార్పు ఏమీ లేకుండానే చల్లారిపోయాయి.
శ్రామిక వర్గ పోరాటం దిశగా తన కృషిని కొనసాగిస్తూ 1864లో మొదటి అంతర్జాతీయ కార్మిక సంఘం ఏర్పాటు చేశాడు మార్క్. 1864లో తన మరొక పుస్తకం దాస్ కేపిటల్ ప్రచురించాడు. తన కల నిజం కాకుండానే 1883లో కార్ల్ మార్క్స్ మరణించాడు. 34 సంవత్సరాల తరువాత రష్యాలో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో మొదటి కమ్యూనిస్టు విప్లవం, కమ్యూనిటీ రాజ్యం ఏర్పడ్డాయి. తర్వాత చైనా, ఉత్తర కొరియా, క్యుబా ఇలా కమ్యూనిస్టు దేశాలు అన్ని ఖండాలలో ఏర్పడ్డాయి.
కరిగిపోయిన కమ్యూనిస్టు స్వప్నం
గ్లోబలైజేషన్, ఫ్రీ మార్కెట్ లాంటి పెట్టుబడీదారి విధానాలతో కమ్యూనిస్టు దేశాల ప్రజలు మార్పు కోరుకోవడంతో మిహయిల్ గోర్బచేవ్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ కమ్యానిజాన్ని వదిలేసి, రష్యాతో పాటు అనేక చిన్న రిపబ్లిక్ లుగా విడిపోవడంతో కమ్యూనిస్టు సిద్ధాంతానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు జర్మనీ లాంటి దేశాలు కూడా కమ్యానిజాన్ని వదిలిపెట్టేశాయి. ప్రస్తుతం ప్రపంచంలో క్యూబా,చైనా, ఉత్తర కొరియా, వియత్నాం, లావోస్ అనే అయిదు దేశాలలో మాత్రమే కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్నా పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్టు భావాలకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.