ఆరు నెలల గడువుతో ప్రకటించిన మారటోరియం మొన్నటి ఆగష్ట్ 31తో ముగిసింది. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. రుణగ్రహీతలకు ఇది పెద్ద సమస్యగా మారింది. సెప్టెంబర్ నుంచి ఈఎంఐల చెల్లింపు సమస్య ఏర్పడడంతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మారటోరియం ఆర్బీఐ ప్రకటనతో అమలులోకి వచ్చిన తరుణంలో, ఆ కాలంలో అప్పులు చెల్లించని వారిని డీఫాల్టర్ గా ప్రకటించరాదని ఆదేశించింది.
మరటోరియం సమయంలో వడ్డీ మాఫీ కోసం దాఖలయిన పిటీషన్ పై సుప్రీంకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మారటోరియం కాలంలో ఎవరినీ నిరర్ధక ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. అదే సమయంలో 15వ తేదీలోగా మారటోరియం విషయంలో మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశమయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ఆదేశమిచ్చారు.
కరోనా సమయంలో నష్టపోయిన వారికి బ్యాంకులు అండగా ఉండాలన్నారు. దానికి అనుగుణంగా రుణాల పునర్వవస్థీకరణ చేపట్టాలని సూచించారు. కంపెనీలు, రుణ సంస్థలతో పాటుగా వ్యక్తిగత లబ్దిదారులకు కూడా మారటోరియం ఫలితాలు అందేలా చూడాలన్నారు. రుణగ్రహీతలకు పునర్వవస్థీకరణకు సంబంధించి ఆగష్ట్ 6న ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. రుణ గ్రహీతలు డిసెంబర్ 31లోగా బ్యాంకులను సంప్రదించవచ్చు. బ్యాంకులు అంగీకరిస్తే 180 రోజుల్లో రుణాల పునర్వవస్థీకరణ జరుగుతాయి. దీనిపై అన్ని బ్యాంకుల వెబ్ సైట్లలో వివరాలున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అర్హులైన వారందరికీ అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.
దీనిపై పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు చేసి రుణల విషయంలో స్పష్టతకు ఈనెల 15లోగా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి ఇచ్చిన ఆదేశాలతో బ్యాంకులు దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి.