iDreamPost
android-app
ios-app

రాజీనామాలు చేసే కాలమా ..?

రాజీనామాలు చేసే కాలమా ..?

నైతిక విలువతో కూడిన రాజకీయాలు 90వ దశకంలోనే పోయాయి. పాలనలో తమ శాఖలు విఫలమైనప్పుడు, ప్రజలకు నష్టం జరిగినప్పుడు, ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆయా శాఖల మంత్రులు రాజీనామాలు చేసిన గొప్ప చరిత్ర భారత ప్రజాస్వామ్యానిది. ఇదంతా గతం. ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు ఆశించడం అంటే.. ఎడారిలో నీటి కోసం అన్వేషించినట్లే. అయినా ప్రతిపక్ష నేతలు వివిధ సందర్భాలలో పాలకులను రాజీనామా చేయాలనే డిమాండ్లను వినిపిస్తుంటారు. తాజాగా వెలుగు చూసిన పెగాసస్‌ నిఘా వ్యవహారానికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ.

ఏపీ, తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహుదూర్‌ శాస్తి రాజీనామా చేశారు. ఎల్‌ఐసీ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో టీటీ కృష్ణమాచారి, సైన్యాన్ని సన్నద్ధం చేయకపోవడం వల్లే చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయామనే విమర్శలు రావడంతో వీకే కృష్ణ మీనన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆయుధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో 1987లో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు వీపీ సింగ్‌. ఒక్క ఓటుతో 1999లో ఎన్టీఏ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి ప్రధాని పదవిని కోల్పోయారు.

Also Read : కోవిడ్ మరణాల వివరాలు – కోరి విమ‌ర్శ‌లు తెచ్చుకున్న‌ కేంద్రం

నేడు ఉన్నదీ ఎన్డీఏ ప్రభుత్వమే. ప్రధానిగా ఉన్నది బీజేపీ నాయకుడే. కానీ 20 ఏళ్లలో ఎంతో వ్యత్యాసం. రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేసినట్లు.. హోం మంత్రి రాజీనామా చేస్తే.. అమిత్‌ షా ఒక్కడే కాదు.. ఏడేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక మంది మంత్రులు రాజీనామా చేయాల్సి ఉండేది. నల్లధనాన్ని అరికట్టేందుకంటూ పెద్దనోట్లను రద్దు చేసి, బ్యాంకుల క్యూలలో వందల మంది ప్రాణాలు పోవడానికి బాధ్యత వహిస్తే నాటి ఆర్థిక మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి.

పుల్వామాలో ఉగ్రదాడిలో 44 మంది సైనికులు చనిపోయినప్పుడు రక్షణ మంత్రి, రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకపోయినా ప్రభుత్వాన్ని నిందించకుండా కరోనా లాక్‌డౌన్‌లో సొంత ఊరు వెళ్లేందుకు రైలు పట్టాలపై వెళుతున్న కూలీల బతులకు అక్కడే తెల్లారిపోయినందుకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి, కరోనా వైరస్‌ సోకిన ప్రజలకు సరైన వైద్యం అందించలేనందుకు వైద్యశాఖ మంత్రి రాజీనామాలు చేయాల్సి ఉండేది. కానీ ఇవేమీ జరగలేదు. వైఫల్యాలను ఒప్పుకునేందుకు నేటి పాలకులు సిద్ధంగా లేరు. ఆరోపణలు వచ్చినప్పుడు, తమ శాఖలు పనితీరులో విఫలమైనప్పుడు ఆయా శాఖల మంత్రులు రాజీనామా చేయడం కాదు.. ఆరోపణలపై వివరణ ఇచ్చినా గొప్ప విషయమే.

Also Read : సుప్రీం కోర్టులో పెగాసస్‌ నిఘా బంతి