iDreamPost
android-app
ios-app

GHMC మూడ్ ఎలా వుంది?

  • Published Dec 01, 2020 | 2:00 AM Updated Updated Dec 01, 2020 | 2:00 AM
GHMC మూడ్ ఎలా వుంది?

స్థానిక సంస్థల ఎన్నికలా లేక లోక్ సభ ఎన్నికల అనే స్థాయిలో ప్రచారంజరిగిన GHMC ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది.సాధారణ మున్సిపల్ ఎన్నిక.. బిజెపి అగ్రనేతల ప్రచారంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్శించింది. లోక్ సభ ఎన్నికల స్థాయిలో ప్రచారం జరిగింది. ప్రచార అంశాలు కూడా మున్సిపాలిటీని దాటి దేశ సరిహద్దుల వరకు వెళ్లాయి.

2007లో MCH (మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ హైద్రాబాద్) శివారు మున్సిపాలిటీలు, పంచాయితీల విలీనంతో GMHC ఆవిర్భవించింది. 2005లో పట్టణాభివృద్ధి ఎన్నికలను పరోక్ష ఎన్నికలుగా మారుస్తూ చట్టం చేశారు. దీనితోపాటు స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ, రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ(2009లో చట్టం చేశారు)లకు ఎక్స్-ఆఫీషియో సభ్యులుగా చైర్మన్, మేయర్ ఎన్నికలో ఓట్లు వేస్తారు. దీనితో ఈ ఎన్నికను రెండు భాగాలుగా చూడాలి. 150డివిజన్లలో కార్పొరేటర్లను ప్రజలు ఓటుతో ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం 45 మంది ఎక్స్-ఆఫీషియో మెంబర్లు ఉన్నారు. వీరిలో GHMC పరిధిలోని 24 మంది ఎమ్మెల్యే ,5 లోక్ సభ సభ్యులతో పాటు రాజ్యసభ మరియు ఎమ్మెల్సీలు కలిసి 16 మంది ఉన్నారు. కొంతమంది రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలు జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా ఓటు వేయటంతో 54 ఉండవలసిన ఎక్స్-ఆఫీషియో సభ్యుల సంఖ్య 45కు తగ్గింది. 2009 మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అందరు ఎమ్మెల్సీలను GHMC లోనే ఎక్స్-ఆఫీషియో సభ్యులుగా నమోదు చేయించటంతో ఆ సంఖ్య 64 అయ్యింది.

మేయర్ గా ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం ఉన్న 45 మంది ఎక్స్-ఆఫీషియో సభ్యులలో తెరాస కు 31,ఎంఐఎం 10,బీజేపీ 3 ,కాంగ్రెస్ 1(రేవంత్ రెడ్డి) బలం ఉంది.
ఎక్స్-ఆఫీషియో సభ్యులతో కలిపి మేయర్ ఎన్నికకు 195 మందికి ఓటు హక్కు వుంది కాబట్టి మేయర్ కావటానికి 98 ఓట్లు కావాలి.

పై లెక్క ప్రకారం కాంగ్రెస్ కు మేయర్ పదవి దక్కాలి అంటే 97 డివిజన్లలో గెలవాలి. కాంగ్రెస్ ఇన్ని డివిజన్లలో బలమైన అభ్యర్ధ్యులను పోటీకి దించిందా?అన్నది కూడా అనుమానమే. రేవంత్ రెడ్డి బహిరంగంగానే 25 డివిజన్లు లు గెలుస్తాం అని చెప్పాడు. ఈ లెక్కన కాంగ్రెస్ మేయర్ రేసులో లేనట్లే..

మేయర్ పీఠం దక్కాలంటే బీజేపీ 95 డివిజన్లు గెలవాలి .బీజేపీ వ్యూహకర్తలు భూపేందర్ యాదవ్, సునీల్ డియోధర్ ప్రణాళికలు,అమిత్ షా , జేపీ నడ్డా,స్మృతి ఇరానీ,ప్రకాష్ జావడేకర్ లాంటి జాతీయ నేతలతో పాటు బండి సంజయ్ మరియు ధర్మపురి అరవింద్ సవాళ్లతో బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ ఎన్నికల్లో మేయర్ సీట్ ఎవరికీ వస్తుందన్న దానికన్నా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దాని మీదనే ఎక్కువ చర్చ నడుస్తుంది. బీజేపీ కచ్చితంగా రెండవస్థానంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పోగుట్టుకుంటుంది.

2016 ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం మీద చాలా పాజిటివ్ ఓటుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కూడా తెరాసలో చేరటంతో పాటు వైసీపీ అభిమానాలు కూడా తెరాసకే ఓటు వేశారు.. కేటీఆర్ 100 సీట్లు సాధిస్తామని చెప్పగా,వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానని సిపిఐ నారాయణ అనటం ఆ ఎన్నికల్లో ఎక్కువ ప్రచారం పొందింది. తెరాస 99 డివిజన్లలో గెలిచి జామ్ బాగ్ లో కేవలం 5 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మార్చుకోవటానికి చేసిన ప్రయత్నాలు కొంత ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి కానీ 95 సీట్లు గెలిచేంత ప్రభుత్వ వ్యతిరేకత కానీ,బీజేపీ అనుకూలత కానీ లేవు.

ఇంకా మిగిలింది తెరాస,సొంతంగా మేయర్ పీఠం ఎక్కటానికి 67 డివిజన్లు గెలవాలి. మేయర్ సీట్ గెలవటం కాదు,ఎంఐఎం మద్దతు లేకుండా ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని తమ వైపు తిప్పుకోకుండా సొంతంగా 67 డివిజన్లు తెరాస గెలవాలి. గతంలో వచ్చిన 99 స్థానాలలో కొన్ని ఓడిపోయినా 67 కన్నా ఎక్కువ డివిజన్లు గెలుస్తామన్నా ధీమాలో తెరాస నేతలు ఉన్నారు.

ప్రజల అభిప్రాయం ఎలా ఉంది?
GHMC ఎన్నికల ఫలితాలను బస్తీ ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రతి బస్తీ కి కమిటీ ఉంది,ఎక్కువ మందిని ప్రభావితం చేసే నాయకులు ఉన్నారు. వీరు ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడే ఓటర్లు. సహజంగానే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీకి ఓటు వేస్తారు.వీరిలో మార్పు కోరుకునే వారు తక్కువ,డబ్బు ప్రభావం ఎక్కువ.

వరద సహాయక చర్యల మీద ప్రజల్లో కోపం ఉన్నా అది అధికారిక తెరాస ను ఓడించే స్థాయిలో లేదు.తెరాస ను ఇబ్బంది పెడుతుంది ఇళ్ల సమస్య. ప్రజలు పక్కా ఇళ్ల కోసం కెసిఆర్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఒక సెక్షన్ లో కరోనా నివారణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారన్న కోపం ఉంది. వీళ్ళలో ఎంతమంది పోలింగ్ బూత్ కు వెళతారన్నది ప్రశ్నార్థకం .ప్రభుత్వం తీసుకున్న ఎల్ ఆర్ యస్ నిర్ణయం పట్ల వ్యతిరేకత ఉంది.

పార్టీల బలం,బలహీనతలు

మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బీజేపీ 50 కన్నా ఎక్కువ డివిజన్లలో గెలవాలంటే బస్తీలను ప్రభావితం చెయ్యాలి కానీ బీజేపీకి అంత యంత్రాంగం ఉన్నట్లు కనపడటం లేదు. ఎల్బీ నగర్ ,మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న దిల్ సుఖ్ నగర్,సర్వ్ నగర్ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది. ఇక్కడ అన్నివర్గాలలో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు బీజేపీ అనుకూలత కనిపిస్తుంది.

బీజేపీ గెలిచే సీట్లలో దాదాపు సగం ఇక్కడ నుంచి మరియు పాత బస్తీ నుంచే ఉంటాయి. పాతబస్తీలో బీజేపీ సీట్లు పెరుగుతాయి. బీజేపీ ఎన్ని డివిజన్లు గెలుస్తుందన్నది పోలింగ్ సమయంలో వాళ్ళు ఎంత సమన్వయంతో పనిచేస్తారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర విజయం సాధించిన బీజేపీ నేత రఘునందన్ రావ్ GHMC ప్రచారంలో వైయస్ఆర్ మరణం మీద చేసిన వాఖ్యలు వైసిపి శ్రేణులకు ఆగ్రహం కలిగించాయి. ఆ వాఖ్యల తరువాత రఘునందన్ రావ్ ప్రాచారంలో పెద్దగా కనిపించలేదు.

తెరాసకు ప్రధాన సమస్య వారి బలమే. ప్రతి సారి 99 గెలవటం సులభం కాదు, ఆరు సంవత్సరాల అధికారం వలన కావచ్చు వర్గ పోరు ఎక్కువయ్యింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు వాళ్ళు కోరుకున్న అభ్యర్థులకే తెరాస ఎక్కువ సీట్లు ఇచ్చింది. అయినా కానీ కార్పొరేటర్ల ను గెలిపించుకోవాలన్న కసి నాయకుల్లో అంతగా కనిపించటం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధమయినట్లు తెరాస శ్రేణులు సిద్ధం కాలేదు.

తెరాస 21 మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు ఈసారి సీట్ ఇవ్వలేదు. అనేక డివిజన్లలో స్థానిక కార్పొరేటర్ల మీద ఉన్న వ్యతిరేకత కూడా తెరాస కు ఇబ్బంది కలిగించే అంశం.

ఉద్యోగ వర్గాలలో తెరాస ప్రభుత్వం పట్ల మిశ్రమ స్పందన ఉంది. రెవిన్యూ ఉద్యోగుల్లో ఎక్కువ వ్యతిరేకత ఉండగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి అనుకూలత ఉంది. ఎన్నికల డ్యూటీలో రెవెన్యూ ఉద్యోగులను ఉపయోగించుకోకపోవటం యాదృచ్చికం కాదు.

కొంత వ్యతిరేకత ఉన్నా ఇప్పటికీ తెరాస ప్రతిపక్షాలకన్నా చాలా బలంగా ఉంది.

2016 ఎన్నికల్లో రెండు డివిజన్లు గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బోణి చేస్తుందా అన్న స్థితి నుంచి మూడు నాలుగో గెలవటానికి వికాసం ఉందన్న స్థితికి వచ్చింది. బీజేపీ బలపడటంతో మూడోస్థానానికి పడిపోయినా ముక్కోణ పోటీలో కొన్ని డివిజన్లు గెలవటానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తే కాంగ్రెస్ కు హైదరాబాద్‌లో అడ్రస్ మిగులుతుంది.

ఎంఐఎం బలం పెరుగుతుందా?

దేశంలో బీజేపీ,ఎంఐఎంల బలం అనులోమానుపాతంలో పెరుగుతున్నాయి.ఎంఐఎం కు ఇప్పుడు మహారాష్ట్ర,బీహార్ శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. యూపీలో ఎమ్మెల్యేలు గెలవకపోయినా స్థానిక సంస్థలలో కొన్ని స్థానాలు గెలిచింది.

బీజేపీ ఎన్నికల ప్రచారం మొత్తం ఎంఐఎం భుజాల మీద తుపాకీని పెట్టి టిఆర్ఎస్ ని కాల్చినట్లే జరిగింది. అయితే గత ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేసి 44 డివిజన్లలో గెలిచిన ఎంఐఎం ఈ సారి 51 డివిజన్లలో పోటీ చేస్తుంది. పాతబస్తీ బయట బోరబండ,ఎర్రగడ్డ లలో మాత్రమే పోటీలో ఉంది. గతంలో పోటీ చేసిన మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్ ,అంబర్ పేట, గోల్నాక, మౌలాలీ, సోమాజిగూడ,వెంగళరావు నగర్, గాజులరామారం మరియు శేర్లింగంపల్లిలో ఈసారి ఎంఐఎం పోటీ చేయటంలేదు.ఎంఐఎం 2016లో వెయ్యి కన్నా తక్కువ మెజారిటీతో గెలిచిన జాం బాగ్(5),లంగర్ హౌస్(302),కార్వాన్(573),షేక్ పేట్ (658),అక్బర్ బాగ్(781),ఎర్రగడ్డ(951) డివిజన్లలో తిరిగి గెలవటానికి కష్టపడాలి. ఈ ఆరు స్థానాలలో తెరాస రెండవస్థానంలో ఉండటం గమనార్హం.

ఎక్కువ  తక్కువ అనే చర్చతో సంబంధం లేకుండా ముస్లింలలో ఎంఐఎం మీద వ్యతిరేకత ప్రచారంలో బయటపడింది.ఇది ఎంఐఎం ను కలవరపరిచే విషయం . ఒక వైపు బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ ను కన్సాలిడేట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటే ముస్లిం లలో పట్టు తగ్గటం ఎంఐఎం కు ఇబ్బందే. అయితే ఎంబీటీ పూర్తిగా బలహీనపడటంతో కొంచం వ్యతిరేకత ఉన్నా పోలింగ్ బూత్ లోపల పతంగి గుర్తుకే ఓటు వేస్తారని ఎంఐఎం అంచనా.

పార్టీల లక్ష్యాలు
ఎంఐఎం మద్దతు లేకుండానే సొంతంగా మేయర్ పీఠం దక్కించుకోవటం తెరాస లక్ష్యం అయితే మేయరు ఎన్నికకు తమ మద్దతు తెరాస కు అవసరంపడాలని ఎంఐఎం కోరుకుంటుంది. 25 కన్నా ఎక్కువ డివిజన్లలో గెలిచి 2023 శాసనసభ ఎన్నికల్లో GHMC పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలవాలని బిజెపి కోరుకుంటుంది. మేయర్ ఎన్నికలో తెరాస -ఎంఐఎం సహకరించుకునే పరిస్థితి రావాలని బిజెపి కోరుకుంటుంది.కాంగ్రెస్ కు ఉనికిని కాపాడుకోవటం తప్ప పెద్ద లక్ష్యాలు లేవు.

మీడియాలో వచ్చిన హైప్ ను నిలబెట్టుకొని బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుస్తుందా?తెరాస గత ఫలితాలను రిపీట్ చేస్తుందా?చూడాలి.

2002 తరువాత తొలిసారి బ్యాలట్ పేపర్ తో ఎన్నికలు జరుగుతున్నాయి.అన్ని పార్టీలు కూడా పోలింగ్ శాతాన్ని పెంచటానికి ప్రయత్నం చేస్తున్నాయి.