చిన్నప్పటి నుంచి కోతులంటే ఇష్టం. అయినా కోతుల్ని ఇష్టపడని వాళ్లెవరు? అవి మన పూర్వీకులు, గౌరవించడం మర్యాద. నిజానికి మనం కోతుల స్థాయి నుంచి ఎదగలేదు. కోతులు మనుషులై ఉండోచ్చు కానీ, మనిషి మాత్రం కోతి చేష్టలు మానలేదు.
బాల్యంలో చాలా మంది ఆంజనేయస్వామి భక్తులై ఉంటారు. దెయ్యాల నుంచి కాపాడేది ఆయనే కాబట్టి. సమాధులు మీదుగా నడవాల్సి వస్తే శ్రీ ఆంజనేయం , ప్రసన్నాంజనేయం అని స్టార్ట్ చేసేవాన్ని. అయినా సమాధిని చీల్చుకుని దెయ్యం వచ్చి పట్టుకున్నట్టు భయం వేసేది. ఆ దెయ్యంతో ఆంజనేయస్వామి గదాయుద్ధం చేస్తున్నట్టు ఊహించుకునేవాన్ని. మనుషులంతా ఎప్పటికైనా సమాధుల్లోకి వెళ్లాల్సిందే కానీ, ఎప్పటికీ సమాధుల్లోంచి మనుషులు బయటికి రాలేరని లాజిక్‌ని మిస్ అయిపోయాను.
కోతులకి సోషల్ లైఫ్ ఉంటుంది. గ్రూపులు, తగాదాలు , యుద్ధాలు , నాయకత్వ మార్పు ఉంటుంది. ఊరి కోతులు , అడవి కోతులు అనే వర్గీకరణ ఉంటుంది. బార్డర్ దాటితే కిచకిచ యుద్ధ నినాదాలే.
రాయదుర్గంలో 45 ఏళ్ల క్రితం చెట్లు ఎక్కువుండేవి. మనుషులు ఎక్కువై చెట్ల మాయమయ్యాయి. చెట్లు ఉన్న కాలంలో కోతులుండేవి. స్కూల్ నుంచి ఇంటికెళుతున్నప్పుడు కొమ్మల మీద జిమ్నాస్టిక్ చేస్తూ ఉండేవి. తల్లి కోతి ఎగురుతున్నప్పుడు , పిల్లకోతి తల్లిని గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకునేది. ఇదో ముచ్చటైన దృశ్యం.
కోతికైనా మనిషికైనా జీవితం ఒకేలా ఉండదు. ఒకరోజు తల్లి కోతిని సరిగా పట్టుకోలేక పిల్ల జారిపడింది. బిడ్డను పట్టుకుని తల్లి ఏడుస్తూనే ఉంది. తట్టితట్టి లేపింది. కోతులన్నీ పెద్దగా అరిచాయి. బహుశా అది సామూహిక రోదన.
అప్పటి నుంచి తల్లికి మనోవ్యాధి మొదలైంది. రోడ్డు మీద చంటి పిల్లల్ని ఎత్తుకెళుతున్న వాళ్లని చూసి గోల చేసి మీద పడేది. పిల్లల్ని లాక్కోడానికి ప్రయత్నించేది. అది శోకమే కానీ, జనం పాలిట రౌద్రంగా మారింది. ఐదారు సంఘటనలు జరిగే సరికి భయం పుట్టింది.
బీడీల నీలకంఠప్ప అనే షావుకారి ఇంట్లోకి దూరి నెలల బిడ్డని లాక్కెళ్లడానికి తల్లి కోతి ప్రయత్నించింది. డబ్బున్న పిల్లాడి మీద దాడి జరిగే సరికి అందరిలో ఆందోళన.
200 ఇస్తే కాల్చి చంపుతానని ఒక వేటగాడు ముందుకొచ్చాడు. ఖాకీ నిక్కర్ , మాసిపోయిన చొక్కాతో సారా కంపుతో ఉన్నాడు. భుజానికి నాటు తుపాకి.
తుపాకీతో కాల్చడం ఎలా ఉంటుందో చూద్దామనే ఉత్సాహం కోతిని చంపేస్తారనే భయం. వేటగాడి చుట్టూ పిల్లలు. పెద్దవాళ్లు అదిలిస్తున్నా వెనక్కి తగ్గి , మళ్లీ మూగుతున్నాం.
వేటగాడి పేరు రుద్రుడు. గిరిజాల జుత్తు, కోర మీసం, కళ్లు సోడా గోలీల్లా ఉన్నాయి. మనిషి బలంగా ఉన్నాడు. కోతి కోసం వెతుకులాట ప్రారంభమైంది. బిడ్డ పోయినప్పటి నుంచి సమూహానికి దూరంగా ఉంది తల్లి.
జనం అదిగో ఇదిగో అంటున్నారు. కోతి కనపడ్డం లేదు. ఎక్కడుందో తెలియదు. వేటగాడిలో నిరాశ. 200 అంటే ఒక స్కూల్ టీచర్ జీతం. నీలకంఠప్ప వంద రూపాయలిస్తే , మిగిలిన వాళ్లు తలా ఇంత వేసుకున్నారు. తుపాకీ పేలితేనే డబ్బు.
చెట్ల గుబుర్లలో కదలిక. వేటగాడిలో చిరునవ్వు. మెడలోని ఆంజనేయస్వామి తాయత్తుని కళ్లకద్దుకుని భుజానికి ఉన్న తుపాకీని తీశాడు. ఒక కన్ను మూసి గురిపెట్టాడు. కోతి తప్పించుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించడం ప్రారంభించా.
ఏం జరుగుతుందో తెలియని కోతి , జనాన్ని చూసి గుర్రు మంటోంది. అడవిలో ఒకప్పుడు బాగా బతికిన చెట్టు, ఒక చెక్కపేడుగా మారి వేటగాడి తుపాకీగా రూపాంతరం చెందింది. చెక్క , ఇనుప రేకులు కలిసి , మృత్యురూపం దాల్చినట్టుంది.
వేటగాడి వేలు బిగుసుకుంది. తుపాకి గొట్టం కోతినే చూస్తోంది. ధన్‌మని శబ్దం. కోతి తప్పించుకుంది. నాలో సంతోషం. చాలా మందిలో నిరాశ. వేటగాడు వేస్ట్‌గాడు అనే కామెంట్. కోతి గాల్లోకి ఎగిరి కొమ్మలు మార్చుకుంది.
వేటగాడి అహం దెబ్బతినింది. గణేష్ బీడీ తీసి ముట్టించి రెండు దమ్ములు పీకాడు. కళ్లలో ఏదో కోపం. 200 రూపాయలతో ఏం చేయాలో ఈ పాటికి అతను నిర్ణయించుకుని ఉంటాడు. ఇంట్లో చిరుగుల బట్టలతో ఉన్న భార్యాపిల్లలకి బట్టలు కొనాలనో. వర్షాలకి కారుతున్న గుడిసెని బాగు చేయించాలనో , ఎవరి కారణాలు వాళ్లకి ఉంటాయి.
జనం ఏదేదో మాట్లాడుతున్నారు. చెళ్లకెరెలో ఒక వేటగాడు ఉన్నాడని వాడు ఎగిరే పక్షిని , ఈదే చేపని కూడా కొడతాడని, వాన్ని పిలవకుండా వీన్ని పిలవడం తప్పని అంటున్నారు.
వేటగాడిలో రోషం. కళ్లలో నీళ్లు, నిప్పులు. తూటా లోడ్ చేశాడు. అతనికి ఏమీ వినపడ్డం లేదు, కనపడ్డం లేదు. కోతి తప్ప.
కోతి దిగులుగా చూస్తోంది. చనిపోయిన బిడ్డ జ్ఞాపకం వచ్చిందేమో…ధన్…తుపాకి పేలింది. జనం హాహాకారాలు.
కోతి కొమ్మల్లోంచి జారి , దబ్‌మని పడింది. పొట్టలోంచి నెత్తురు. ఇంకా ప్రాణం ఉంది. చిన్న కళ్లు జనాన్ని చూస్తున్నాయి. నా బిడ్డని వెతుక్కోవడం నేను చేసిన తప్పా అనే ప్రశ్న ఉంది.
జనం దండం పెడుతున్నారు. వేటగాడి ఒక కంట్లో గర్వం…ఇంకో కంట్లో నీళ్లు. కోతి మరణయాతన. మరణాన్ని అర్థం చేసుకోలేని వయసు..ఏడుపొచ్చింది. కోతి తన బిడ్డ దగ్గరికి వెళ్లిపోయింది.
దానికి ఎర్రటి బొట్టు పెట్టి ఊరంతా ఊరేగించారు
జనం డబ్బులేశారు
చంపడానికి డబ్బులిచ్చారు, అంత్యక్రియలకీ డబ్బులిచ్చారు
కోతిని మోస్తూ వేటగాడు వెళ్లిపోయాడు
ఇది జరిగి 45 ఏళ్లైంది
కొమ్మల్లోంచి దబ్బున జారిపడి , రక్తంతో తడిసిన కోతి
అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటుంది
జీవితాన్ని మరిచిపోతాం కానీ
మృత్యువుని మరిచిపోలేం.