iDreamPost
iDreamPost
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంతా టైటిల్ రోల్ పోషిస్తున్న శాకుంతలంలో ఆమెకు జోడిగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ కు దాదాపు చెక్ పడినట్టే. ఇప్పటికే ఎంపిక పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. అయితే అతను మనకు ఏ మాత్రం పరిచయం లేని మలయాళం నటుడు కావడం గమనార్హం. గత ఏడాది లాక్ డౌన్ టైంలో అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైన సూఫీయుమ్ సుజాతియుమ్ లో నటించిన దేవ్ మోహన్ ని దుశ్యంతుడిగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ అనధికార విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికీ స్క్రీన్ టెస్టులు ఫోటో షూట్ లు చేసి ఓకే అనుకున్నారట.
నిజానికి ఈ పాత్ర గురించి ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఎవరూ ఊహించని పేరు లాక్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మంచి రూపం నటన కలిగిన దేవ్ మోహన్ కి ఇది ఇంకా రెండో సినిమానే. సూఫీయుమ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా ఇతని యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆఫర్లు కూడా గట్టిగానే వచ్చాయి. అయితే శాకుంతలంలో పెర్ఫార్మన్స్ కి ఎక్కువ స్కోప్ ఉండటంతో బాష రాకపోయినా ఓకే చెప్పినట్టుగా తెలిసింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంని ఆధారంగా చేసుకుని గుణ శేఖర్ ఆవిష్కరించబోతున్న ఈ దృశ్యకావ్యం మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.
మణిశర్మ సంగీతం అందిస్తున్న శాకుంతలంకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. ట్యూన్స్ ఓకే కాగానే రికార్డింగ్ కూడా చేస్తారు. మరోవైపు ఆర్ట్ డిపార్ట్ మెంట్ సెట్లను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉంది. గుణశేఖర్ ఎప్పటికప్పుడు వీటి తాలూకు అప్ డేట్స్ ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రుద్రమదేవి ఫలితం సంతృప్తికరంగానే వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేదనే విషయం తెలిసిందే. అందుకే శాకుంతలంతో గట్టిగా కం బ్యాక్ ఇచ్చేందుకు గుణశేఖర్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ ఏడాది విడుదల ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.