iDreamPost
android-app
ios-app

Modi – మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. అర్థరాత్రి కలకలం.. ఆ మాఫియా పనేనా?

Modi – మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. అర్థరాత్రి కలకలం.. ఆ మాఫియా పనేనా?

శనివారం అర్థరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేయగా, బిట్‌కాయిన్‌కు సంబంధించిన ట్వీట్ చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఈ ట్వీట్ PM మోడీ (@narendramodi) అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి తొలగించబడింది. ఇప్పుడు ఆయన ట్విట్టర్ హ్యాండిల్‌ను మళ్లీ పూర్తిగా రికవర్ చేశారు. ఇక మోడీ ట్విటర్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు బిట్‌కాయిన్‌ను భారతదేశం చట్టబద్ధంగా గుర్తించిందని ట్వీట్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 12) తెల్లవారుజామున 2.11 గంటలకు ‘భారతదేశం అధికారికంగా బిట్‌కాయిన్‌కు చట్టపరమైన ఆమోదం తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా 500 BTCని కొనుగోలు చేసింది మరియు దేశంలోని పౌరులందరికీ పంపిణీ చేస్తోంది. త్వరపడండి అంటూ ఒక లింక్‌ను ట్వీట్ చేశారు.

అయితే ఆ ట్వీట్ కేవలం రెండు నిమిషాల్లోనే డిలీట్ అయింది. రెండవ ట్వీట్ మళ్లీ 2.14 నిమిషాలకు వచ్చింది, ఇది పూర్తిగా మొదటి ట్వీట్ కు కాపీ పేస్ట్. అయితే ఆ వెంటనే ఆ ట్వీట్ కూడా డిలీట్ అయింది. కాసేపటికే మోదీ ఖాతా హ్యాక్‌కు గురైందని పీఎంవో ట్వీట్ చేసి సమాచారం అందించింది. ఈ సమయంలో చేసిన ఏ ట్వీట్ అయినా,ఏదైనా మెసేజ్ వస్తే వచ్చినా వదిలేయాలని PMO సూచించింది. ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ట్విట్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే ట్విట్టర్ స్పందించి రీస్టోర్ చేసిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈలోపే సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌లను జనాలు షేర్ చేయడం ప్రారంభించారు. అయితే ప్రధాని ట్విటర్‌ అకౌంట్‌ కూడా హ్యాక్‌ కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక తీవ్రమైన సెక్యూరిటీ బ్రీచ్ అని భావిస్తున్నారు. దీనిని ‘బిట్‌కాయిన్ మాఫియా’ అని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, క్రిప్టోకరెన్సీపై కూడా నిషేధం విధించబడుతుందని చాలామంది భయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయినట్లు సమాచారం సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. హ్యాక్ చేయబడిన హ్యాష్‌ట్యాగ్ ఓవర్‌నైట్‌లో భారతదేశంలో నాల్గవ స్థానంలో ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

అయితే గత కొన్ని రోజులుగా బిట్‌కాయిన్‌పై భారత్‌లో రగడ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. బిట్ కాయిన్ అనేది ఒక క్రిఫ్టో కరెన్సీ. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బిట్‌కాయిన్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ప్రకటన చేశారు.బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించలేమని, కాయిన్ లావాదేవీలకు సంబంధించి సమాచారాన్ని సేకరించామన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ హ్యాకింగ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.