Idream media
Idream media
ప్రస్తుతం దేశమంతా పశ్చిమ బెంగాల్ రాజకీయాలనే ఆసక్తిగా గమనిస్తోంది. ఇప్పటికే నాలుగు దశల్లో అక్కడ ఎన్నికలు ముగిశాయి. ఇంకా నాలుగు దశలు ఉన్నాయి. 5 దశ ఎన్నికలకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు టీఎంసీ, బీజేపీ పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్నికలు జరగాల్సిన వాటిలో కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. వాటిపై పట్టు కోసం ఇరు పార్టీలూ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రస్తుత ప్రచారంలో ముఖ్యమంత్రి మమత పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గాన్నే బీజేపీ ప్రధాన ప్రచార ఆయుధంగా మలుచుకుంటోంది. నందిగ్రామ్ లో మమత ఓడిపోతున్నారంటూ ఓ పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరో పక్క అమిత్ షా వంటి అగ్రనేతలు అందరూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రే ఓడిపోతుంటే, ఇక టీఎంసీకి ఓట్లు వేసి ఏం ఉపయోగమనే ఆలోచన ప్రజల్లో రేకెత్తేలా చేస్తున్నారు. దీనిపై మమత కూడా ఒంటికాలిపై లేస్తున్నారు. నందిగ్రామ్ లో తన గెలుపును, రాష్ట్రంలో తమ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమాగా చెబుతున్నారు.
బెంగాల్ కోటపై ఎగిరే జెండా ఎవరిదో అన్నది ఎంత ఆసక్తిగా మారిందో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం ఫలితంగా అంతకంటే ఎక్కువ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అదే తూర్పు మెదినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్ సీటు. టీంఎసీ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరి మరీ ఈసారి అక్కడి నుంచి రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా సువేందు అధికారి ఉన్నారు. కమ్యూనిస్టుల కోట బద్దలై బెంగాల్ లో టీఎంసీ పాగా వేయడంలో అధికారిది కూడా కీలక పాత్ర. ఇప్పుడు ఆయనే బీజేపీ నుంచి చేశారు. అధికారి అడ్డాగా నందిగ్రామ్ నుంచి పోటీకి దిగి మమత కూడా బెంగాల్ పోరును మరింత ఆసక్తిగా మార్చేశారు. ఆ నియోజకవర్గంలో రెండో దశ లోనే పోలింగ్ ముగిసిపోయింది. ఫలితం తేలడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, బీజేపీ మాత్రం ఆ నియోజకవర్గాన్ని బేస్ చేసుకునే ప్రచారాన్ని రక్తి కట్టిస్తోంది. నందిగ్రామ్ లో మమత ఓడిపోతున్నారంటూ పదే పదే వెలుగెత్తి చాటుతోంది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రస్తావన తెచ్చి నందిగ్రామ్ పై మరోసారి ఆసక్తిని రేపారు.
Also Read : బెంగాల్.. దంగల్ : ఆ రెండు జిల్లాల్లో టఫ్ ఫైట్!
మమత కూడా మారాల్సి వచ్చింది..
బెంగాల్‌పై కాషాయ జెండాను ఎగురేయాలనుకుంటున్న బీజేపీ మొదటి నుంచీ మమత ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందు కోసం భారీ ప్రణాళికనే రచించింది. సవాళ్లు – ప్రతి సవాళ్ల ద్వారా మమత నందిగ్రామ్ నుంచి పోటీకి దిగేలా చేశారు. మమత కూడా చాలెంజింగ్ తీసుకుని అక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో నందిగ్రామ్‌లో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని దింపి ప్రచారంతో హోరెత్తించింది. ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మమతను ఓడిస్తే చాలు.. పశ్చిమ బెంగాల్ తమ హస్తగతం అవుతుందనే కాన్సెప్ట్‌తో కసరత్తులు చేశారు. అక్కడ ఎన్నికలు ముగిసినా ఇప్పటికే నందిగ్రామ్ అంశమే ప్రధానంగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. నందిగ్రామ్‌లో ఓటర్ల సంఖ్య 2 లక్షల 75 వేలు. ఇందులో 2 లక్షల మంది ఓటర్లు హిందువులే. దీంతో బీజేపీ కండువా కప్పుకున్న సువేందు అధికారి. రామ జపం ప్రారంభించారు. పాల్గొన్న ప్రతిసభలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీనికి తోడు మోదీ, షాల ప్రచార అండ.. దీంతో హిందూ ఓటు బ్యాంక్ మెల్లిగా బీజేపీ చేతికి జారిపోతున్నట్టు భావించిన మమత కూడా సరికొత్త రూపాన్ని ఎత్తారు. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో వీల్‌చైర్ పైనే ప్రచారంలో పరుగులు తీశారు. ప్రత్యేక పూజలు, చండీ మంత్రాలతో పాటు తొలిసారిగా తాను ఓ హిందూ బ్రహ్మణ మహిళనంటూ ప్రకటించుకున్నారు. హోరాహోరీగా ముగిసిన పోలింగ్ ఫలితం మే 2న వెల్లడి కానుంది.
మమత క్లీన్ బౌల్డ్
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్‌లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 17 న పోలింగ్ జరిగే 5వ దశలో 45 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలుస్తామని మోదీ చెబుతున్నారు. నందిగ్రామ్‌లో మమత క్లీన్‌బోల్డ్ అయ్యారని, తన ప్లేస్‌లో కూడా గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా..?
Also Read : బెంగాల్ దంగల్ : పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం ?