దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక సౌండ్ తో ఇప్పుడు ప్రైవేటు పదం వినిపిస్తోంది. కొద్ది కాలంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ జోరు పెరుగుతోంది. తాజా బడ్జెట్ లోనూ ఇది కనిపించింది. కేంద్రం పరిధిలోని పలు కంపెనీలను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించడం కొన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తుండగా.. కార్పొరేట్ వర్గాల్లో జోష్ కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం రోజున భారతీయ స్టాక్ మార్కెట్ ఆల్ టైం రికార్డు దిశగా పరుగులు తీయడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, దేశం గట్టెక్కాలంటే ప్రభుత్వ రంగ వాటాల విక్రయం తప్పదని చెప్పిన ప్రభుత్వం.. మనది శక్తివంతమైన దేశమని.., లాక్ డౌన్ నుంచి సృష్టించిన విపత్తు నుంచి అందుకే త్వరగా బయటపడగలిగామని చెబుతూ కూడా కార్పొరేటుకు కార్పెట్ వేయడం విమర్శలకు తావిస్తోంది. అధికారంలోకి రాక ముందు ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకించి మన్మోహన్‌సింగ్ సర్కారుపై విరుచుకుపడిన బీజేపీ ఇప్పుడు అంతకుమించి ప్రైవేటు మార్గంలో దూసుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, బీహెచ్‌ఈఎల్, విద్యుత్, ఎల్‌ఐసీ, విమానయానం, రక్షణ.. ఇలా అన్ని రంగాలలోనూ తలుపులు బార్లా తెరవడం దేశానికి క్షేమకరం కాదనే వాదన వినిపిస్తోంది. దీని వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుందని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది.
1996 నుంచీ పెరిగిన విక్రయాల వేగం
దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ 1991లోనే మొదలైనప్పటికీ.. 1996 నుంచీ వేగం పుంజుకున్నట్లుగా ఆయా వ్యవస్థల్లోని మార్పులు తెలియజేస్తున్నాయి. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనూ దాదాపు ఏడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పదేండ్లలో మూడు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీన్ని అప్పట్లో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా అదే దారిలో పయనిస్తోంది. గత ఏడేళ్ల కాలంలో 23 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. పలు సంస్థల్లో 50 శాతానికంటే తక్కువకు ప్రభుత్వ వాటా తగ్గించుకొన్నారు. 2014కు ముందు ఎన్నికల ప్రచారంలో ‘నేను రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్ముకున్నానే తప్ప దేశాన్ని అమ్మను’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే రైల్వేశాఖను విభాగాలవారీగా, రూట్లవారీగా ప్రైవేట్ సేట్లకు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1924లో మొదలైన రైల్వే బడ్జెట్ ప్రస్థానానికి 2016లో మోదీ సర్కారు ముగింపు పలికింది. ఆ చర్యతోనే రైల్వేలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర వేగవంతమైందని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకు తగినట్లుగానే 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు గడచిన జూలై 1న ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ఆదాయం తగ్గిపోయిందనే కారణంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 31 స్టేషన్లను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో 29 స్టేషన్ల మూసివేత ఈ నెల ఒకటినే జరిగింది. మరో రెండు స్టేషన్లను ఏప్రిల్ 1 నుంచి మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరంలోనే పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 2.10 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రతిపాదనలు రూ. 35,000 కోట్లు తక్కువ కావడానికి కోవిడ్–19 ప్రతికూల ప్రభావం చూపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సీపీఎస్‌ఈలలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 19,499 కోట్లు మాత్రమే సమీకరించిన కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా పెంచుకోవాలనే లక్ష్యంతో వెళ్తోంది. దీనిలో భాగంగా బీపీసీఎల్ (ప్రభుత్వ వాటా 52.98%), ఐడీబీఐ బ్యాంక్ (47.1%), కాంకర్ (30.8%), షిప్పింగ్ కార్పొరేషన్ (63.75%), బీఈఎంఎల్ (54.03%)లను అమ్మకానికి పెట్టడం ద్వారా ఆ భర్తీ పూర్తి చేయాలని తహతహలాడుతోంది.
వాటాల విక్రయం ద్వారా లక్ష కోట్లు
వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ బాటలో సీపీఎస్‌ఈల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మరో రూ. 75,000 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ వ్యూహంలో భాగంగా నాలుగు రంగాలను ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అణు ఇంధనం(ఆటమిక్ ఎనర్జీ), అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లను ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను నామమాత్రం చేయనున్నారు. ఈ రంగాలలో మిగిలిన సీపీఎస్‌ఈలను ప్రయివేటైజ్ చేయడం లేదా విలీనం లేదా అనుబంధ సంస్థలుగా మార్చడం వంటి అంశాలకు తెరతీయనున్నారు. ఇలాకాకుంటే వీటిని మూసివేస్తారు. ఇందుకోసం పీఎస్‌యూ మార్గదర్శకాలనే సమూలంగా మార్చేశారు. ఈ తరహా చర్యల వల్ల దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఉద్యోగ, కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి ఓ ప్రత్యేక కంపెనీ
వచ్చే ఏడాదిలో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ తదితరాల డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తి చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ సహా మరో రెండు పీఎస్‌యూ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పీఎస్‌యూలలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయా సంస్థలతో పాటు కీలకంకాని ఆస్తుల జాబితాలో ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల వద్ద గల మిగులు భూములను ప్రత్యక్ష విక్రయం లేదా ఇతర విధానాలలో మానిటైజేషన్‌కు వీలుగా ఒక ప్రత్యేక కంపెనీ(ఎస్‌పీవీ)ను ఏర్పాటుకు తాజా బడ్జెట్ లో ప్రతిపాదించారు.
ఏది నిజం..?
వచ్చే ఏడాది(2021–22)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బాటలో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తాజాగా ఆర్థిక మంత్రి తెలియజేశారు. జీవిత బీమా బ్లూచిప్ కంపెనీ ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100 శాతం వాటా ఉంది. ఇప్పటివరకు ఎల్‌ఐసీ బీమా సొమ్ము రూపంలో సేకరించిన రూ.30 లక్షల కోట్లను కేంద్రం వాడుకున్నట్లుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాంటి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని అంటున్నారు. కేంద్ర వాదన మరోలా ఉంది. ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే రూ. 8–10 లక్షల మార్కెట్ విలువను సాధించగలదని విశ్లేషకుల అంచనా వేస్తున్నారని, తద్వారా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిచే వీలున్నట్లు చెబుతోంది.
నిరుద్యోగం పెరుగుతుందా..?
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 33.3 కోట్ల మంది యువతీయువకులు ఉన్నారు. 2021 నాటికి ఆ సంఖ్య 36.7 కోట్లకు చేరుతుందని అంచనా. 2018 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసిక నివేదిక ప్రకారం, దేశంలో అర్హతగల యువతలో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం గణాంకాల ప్రకారం, నిరుద్యోగిత రేటు బిహార్‌లో అత్యధికంగా 40.9 శాతం ఉంది. ఆ తర్వాత కేరళలో 37 శాతం, ఒడిశాలో 35.7 ఉండగా, గుజరాత్‌లో అత్యల్ప నిరుద్యోగిత రేటు (9.6 శాతం) ఉంది. అది తుది నివేదిక కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇంచుమించు అవే లెక్కలు నిజమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ జరుగుతూ ఉంటే నిరుద్యోగ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పేదలు ఆ అవకాశాలు పొందగలరా..?
సాధారణంగా రైళ్లలో ప్రయాణించేది పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులే. వీరిలో చాలామంది తమవెంట తమ సంతానాన్ని, కొంత వరకు లగేజీలను కూడా తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఈ లగేజీలకు, చిన్నారులకు టికెట్లు లేకున్నా ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. మరి ప్రైవేటు రైళ్లలో అనుమతిస్తారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు రైళ్లు నడిపేవారికి లాభార్జనే ప్రధానంగా ఉంటుందని, ప్రతిచోటా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తారని, అలాంటప్పుడు చిన్నపిల్లలకు, చిన్నచిన్న లగేజీలకు కూడా చార్జీలు వేస్తే సగటు ప్రయాణికుడు రైలు ఎక్కలేని పరిస్థితి వస్తుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. ఇతర రంగాలలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజల కోసం ప్రభుత్వాలు ఆలోచించినట్లుగా ప్రైవేటు వర్గాలు పట్టించుకోవనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..?
మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెట్టేస్తున్నారంటూ సోమవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ‘జనం చేతుల్లో డబ్బులు ఉంచడానికి బదులు, మోదీ ప్రభుత్వం దేశానికి చెందిన ఆస్తులను తన క్రోనీ క్యాపిటలిస్ట్ మిత్రులకు ధారాదత్తం చేసేందుకు ప్లాన్ చేసింది’ అని ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో ‘‘బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా, పీఎస్‌యూలు ప్రైవేటీకరణ చేశారు. దీంతో ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది.‘‘ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో, ప్రజల సంక్షేమం కోసం కీలకంగా ఉన్న ఎల్‌ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సరికావన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. .