Idream media
Idream media
కరోనా రెండో దశ కట్టడిలో కేంద్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉండగా, పేరు కోసం విదేశాలకు పంపడంపై భారీ స్థాయిలోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఓ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.., వ్యాక్లిన్ల పంపిణీపై కేంద్రానికి ఏమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. ఉచితంగా ఇవ్వలేమని, రాష్ట్రాలే భరించాల్సిందిగా చెప్పుకొచ్చారు. ఆపద సమయంలో కూడా కేంద్రం ఇలా వ్యవహరించడంతో ముప్పేట దాడి పెరిగింది. బీజేపీయేతర రాష్ట్రాలతో పాటు, ఉన్నత న్యాయస్థానం కూడా కేంద్రం తీరును తప్పుబట్టాయి. అలాగే, కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగకపోవడాన్ని ప్రతిపక్షాలు తమకు అనువుగా మార్చుకుంటున్నాయి.
ఈ వ్యతిరేకత ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రభావం చూపినట్లు మోదీ గుర్తించారు. అలాగే, భవిష్యత్ లో యూపీ సహా పలు రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడంతో కేంద్రం తన పనితీరుపై స్వీయ సమీక్ష జరుపుకున్నట్లు తెలిసింది. వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దానిలో భాగంగానే వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్రానిదేనని, కేంద్రమే పూర్తిగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని, ఇందుకు సంబంధించి కొత్త గైడ్‌లైన్స్ ఇస్తామని ప్రధాని తాజా ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే, వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని చెప్పడమే కాకుండా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలు కూడా తగ్గించడంపై దృష్టి సారించారు. ఫలితంగా పలువురు ముఖ్యమంత్రులు కేంద్రం తాజా నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారంటూ మోదీ ఈ సందర్భంగా విపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ సరైన సమయంలోనే లోపాలు గుర్తించి సరిదిద్దుకోవడం ద్వారా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.