రెండు మూడు రోజులుగా ఢిల్లీలోని బీజేపీ ఇలాకాల్లో ఒకటే హడావుడి. ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా నివాసాలకు ప్రముఖుల తాకిడి.. వరుస భేటీలు, గంటల తరబడి మంతనాలు.. ఇవన్నీ చూసి ఉత్తరప్రదేశ్ పార్టీ, ప్రభుత్వంలో మార్పులకు కసరత్తు జరుగుతోందని మీదట రాజకీయ, మీడియా వర్గాలు భావించాయి.
కానీ ఇతర పార్టీల నేతలు, పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు కూడా తరలి రావడంతో.. యూపీ మార్పులతోపాటు కేంద్రంలోనూ మార్పుచేర్పులకు సమీకరణల కూర్పు జరుగుతోందని అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. దానికి సంబంధించిన కూడికలు తీసివేతలతో రెండు రోజులుగా ఆయన బిజీగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన వెంటనే కేబినెట్ విస్తరణ చేపట్టాలనుకున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు పరిస్థితి కుదుట పడటంతో పాటు.. యూపీలో మార్పులకు లింక్ ఉండటంతో.. కేబినెట్ విస్తరణకు మోదీ సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి చేసిన ఆయన.. అనుకోని అవాంతరాలు ఎదురుకాకుండా ఉంటే వచ్చే వారమే విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం.
యూపీ, పంజాబ్ లకు పెద్దపీట
దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ, పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. సీఎం యోగి అదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు వేల్లువెత్తుతున్నాయి. కోవిడ్ కట్టడిలో వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు, స్థానిక ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలు ఇంటా బయటా బీజేపీ ప్రతిష్టను దిగజార్చాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిస్థితి కాషాయ దళానికి సంకటంగా మారింది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో యూపీకి చెందిన బలమైన నేతలకు చోటు కల్పించి పార్టీకి జవసత్వాలు కల్పించాలని భావిస్తున్నారు. గతంలో ఎన్డీయేకు దూరమైన అప్నాదళ్ పార్టీని మళ్లీ కేంద్ర కేబినెట్లో చేర్చుకొని యూపీలో బలపడాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి అనుప్రియ పటేల్ హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. ఇక ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రమైన పంజాబ్ పైనా దృష్టి సారించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి నుంచి ఆకాలీదళ్ పార్టీ వైదొలగడంతో పంజాబ్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. అందువల్ల రాష్ట్రంలో పార్టీకి బలం చేకూర్చగల నేతలకు కేంద్రంలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
భారీ విస్తరణ
2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. కేబినెట్లోకి 79 మంది వరకు తీసుకోవచ్చు. ఆ లెక్కన ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతోపాటు 23 మందిని కొత్తగా తీసుకునే అవకాశం ఉంది. పలువురు మంత్రులు అదనపు శాఖల భారంతో సతమతమవుతున్నారు. ఆరుగురు మంత్రులు రెండేసి కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. వారికి భారం తగ్గించడంతోపాటు కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉంది. అన్నీ కలిసి కేబినెట్ విస్తరణ భారీగానే ఉంటుందని అంటున్నారు. వీటిపై మోదీ, అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిన్న సాయంత్రం భేటీ అయ్యి సుదీర్ఘ కసరత్తు జరిపారు. ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, హారదీప్ సింగ్ తదితర ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కూడా భేటీలో పాల్గొన్నారు.