iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడున్నారు. ఇప్పుడు మండలిలో ఎస్సీలకు అవకాశం కల్పించడం ద్వారా జగన్ తనదైన మార్క్ చూపించారు. ఏపీ చరిత్రలోనే తొలిసారిగా రెండు సభలకు ఎస్సీ, బీసీలు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే సామాజిక న్యాయంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ మండలిలో ప్రస్తుతం ఏకంగా నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని రీతిలో ప్రస్తుతం మైనార్టీలకు మండలిలో అవకాశాలు దక్కాయి. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు కూడా అదే రీతిలో సగం సీట్లు కేటాయించేందుకు పూనుకోవడం ద్వారా జగన్ తనదైన పంథాలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజు మండలి చైర్మన్ స్థానానికి నామినేషన్ వేశారు. రేపు ఆయన ఏకగ్రీవ ఎన్నికల లాంఛనమేనని చెప్పవచ్చు. తొలిసారిగా మండలిలో అడుగుపెట్టిన ఆయనకు ఏకంగా చైర్మన్ పీఠం దక్కడం విశేషం. గడిచిన దశాబ్దకాలంగా పార్టీ కోసం, జగన్ బాటలో నడిచినందుకు ప్రతిఫలంగానే ఆయనకు ఈ స్థానం దక్కినట్టు కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. వైఎస్సార్ అనుచరుడిగా ఉన్నారు. కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఓసారి అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Also Read : కొయ్యే మోషేన్‌రాజు.. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీ వరకూ
ఇటీవల ఆయనకు మండలిలో అవకాశం వచ్చింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషేన్ రాజు ప్రారంభం నుంచి జగన్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అందుకు అనుగుణంగానే మరోసారి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారికే మండలి చైర్మన్ పీఠం కేటాయించేందుకు సిద్ధమయినట్టు కనిపిస్తోంది. మండలి చైర్మన్ గా టీడీపీ హయంలో వ్యవహరించిన ఎంఏ షరీఫ్ కొద్దికాలం క్రితం రిలీవ్ అయ్యారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత చైర్మన్ హోదాలో తాత్కాలికంగా పీడీఎఫ్ కి చెందిన విఠపు బాలసుబ్రహ్మణ్యం వ్యవహరించారు.
ఈరోజు ప్రారంభమయిన మండలి సమావేశాలు కూడా ఆయన అధ్యక్షతనే జరిగాయి. అయితే కొత్త ఎమ్మెల్సీలు వచ్చిన తర్వాత డిసెంబర్ లో నిర్వహించే మండలి సమావేశాల్లో కొత్త చైర్మన్ ఎంపిక ఉంటుందని తొలుత భావించారు. కానీ ఈ సమావేశాలు పొడిగించడంతో కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యమయ్యింది. దాంతో మోషేన్ రాజుకి కీలక స్థానం దక్కినట్టయ్యింది. పలువురు సీనియర్లుండే మండలిలో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుందన్నది చర్చనీయాంశమే.
Also Read : మండలి చైర్మన్‌గా పదవి విరమణ చేసిన షరీఫ్.. రాజకీయ జీవితంలో అదొక్కటే మచ్చ..!