iDreamPost
android-app
ios-app

Mlc karimunnisa – ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత

Mlc karimunnisa – ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత

కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసన మండలి సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఆ సమావేశానికి హాజరై ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్ కు తరలించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీ కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.


గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్‌లో 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. జూన్ 6, 1966లో విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్ డాబా కొట్లు ప్రాంతంలో జన్మించిన  కరీమున్నీసా వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ముందు నుంచి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా ముందుండేవారు. ముఖ్యంగా విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి ఆమె పని చేశారు. వైఎస్సార్సీ పార్టీ స్థాపించినప్పటి నుంచి విజయవాడలో జగన్‌ పాటు పనిచేసిన వారిలో కరీమున్నీసా కుటుంబం కూడా ఒకటి.

Also Read:కార్పోరేటర్ చాలు అనుకుంటే ఏకంగా ఎమ్మెల్సీ పదవి వరించింది …

టీడీపీ ప్రభుత్వంలో కేసులను ఆమె కుటుంబం ఎదుర్కొంది. కరీమున్నీసాకు ఐదుగురు పిల్లలుకాగా కరీమున్నీసా చిన్న కుమారుడు రహ్మతుల్లా జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 2010 నుంచే జగన్‌తో రహ్మతుల్లాకు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి పార్టీలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు కరీమున్నీసా. జగన్ పాదయాత్ర చేసే సమయంలో 56వ డివిజన్‌లో ఆగారు. తాను సీఎం అయితే ఇక్కడ నుంచే ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆమెను ఎమ్మెల్సీని చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా డివిజన్‌ అభివృద్ధికి కరీమున్నీసా కృషి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికీ కృషి చేశారు.


2014లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 వ డివిజన్ నుంచి వైకాపా తరపున కార్పొరేటర్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. అయితే తర్వాత వార్డుల పునర్విభజన లో 56 వ డివిజన్ 59 గా మారడంతో మొన్నటి ఎన్నికల్లో ఆ డివిజన్ నుంచి బరిలోకి దిగగా చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆమెకు మైనార్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. కరీమున్నీసా చివరి కొడుకు రహ్మతుల్లా ప్రస్తుతం వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. మహిళా నేత మృతితో కృష్ణా జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం ఎనిమిది నెలలు పాటు మాత్రమే ఆమె పని చేశారు. ఇంతలోనే విధి ఇలా ఆమెను బలి తీసుకుంది.