iDreamPost
android-app
ios-app

మొన్న వైసీపీ ఎంపీని మోసం చేసిన వాడే నేడు ఎమ్మెల్సీకి టోకరా వేశాడు..!

మొన్న వైసీపీ ఎంపీని మోసం చేసిన వాడే నేడు ఎమ్మెల్సీకి టోకరా వేశాడు..!

మొన్న ఎంపీ, నేడు ఎమ్మెల్సీ.. అధికార పార్టీ నేతలే సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్‌ అయ్యారు. సామాన్య ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు కూడా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. లాటరీలు, సబ్సడీ పథకాలు, ఉచితాలు అనే మాటలకు సామాన్యులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆకర్షితులవుతూ బొక్కబోర్లా పడుతున్నారు. చివరికి అసలు విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఓ సైబర్‌ నేరగాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌కు టోకరా వేశాడు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణం అంటూ ఎమ్మెల్సీ అనుచరుల నుంచి కేటుగాళ్లు 10 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. అయితే ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో ఎమ్మెల్సీకి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే సీఎంవో, పరిశ్రమల శాఖ అధికారులను ఆరా తీశారు. ఇలాంటి సబ్సిడీ పథకాలేవీ లేవని వారు చెప్పడంతో ఖంగుతిన్న ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. వారు చేసిన ఫోన్, బ్యాంకు ఖాతాల ద్వారా కేటుగాళ్లను గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కరోనా క్వారంటైన్‌ కేంద్రంలో నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీనాయుడు, వెంకటరెడ్డి అనే ఇద్దరు ఈ నేరానికి పాల్పడినట్లు తేల్చారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని హిందూపురం టూ టౌన్‌కు తరలించారు.

సదురు నేరగాడు బాలాజీ నాయుడు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామం. మే నెలలో కూడా బాలాజీనాయుడు పలువురు ప్రజా ప్రతినిధులకు టోకరా వేశాడు. ఇతని చేతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు మోసపోయారు. పరువు పోతుందని పలువురు మిన్నుకుండిపోగా, అమలాపురం ఎంపీ అనురాధ ఈ కేటుగాడి ఆట కట్టించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు బాలజీనాయుడును మే నెల 19వ తేదీన పట్టుకున్నారు. అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అయితే ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన బాలాజీనాయుడు మళ్లీ తన పాత పంథాలోనే ప్రజా ప్రతినిధులను మోసం చేయడం ప్రారంభించాడు.

Read Also : ఒక్కడు 35 మంది ప్రజా ప్రతినిధులను మోసం చేశాడు

కేవలం నెల రోజుల వ్యవధిలో బాలాజీ నాయుడు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీలను మోసం చేశాడంటే లోపం ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. గత నెల 19వ తేదీన అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆ నేరగాడ్ని కోర్టులో హాజరుపరిచి వదిలేశారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ మోసం చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని బాలాజీ నాయుడు చేసిన నేరాన్ని సాక్షాధారాలతో నిరూపించి అతనికి శిక్షపడేలా చేసి ఉంటే తాజాగా మరో ఎమ్మెల్సీ మోసపోయేవాడే కాదు. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు పంపిన పోలీసులు ఆ తర్వాత ఆ కేసుపై దృష్టి పెట్టలేదని తాజాగా బాలాజీ నాయుడు చేసిన నేరం స్పష్టం చేస్తోంది. దొంగతనం కేసులో బెయిల్‌ మంజూరు కాదు. ఇది కూడా దొంగతనం లాంటిదే. ఇతరులను మోసం చేసి డబ్బులు కొల్లగొట్టే బాలాజీ నాయుడు లాంటి వారి ఆటలను పోలీసులు కట్టుదిట్టంగా అరికట్టేలా పని చేయాల్సిన అవసరం ఉంది. బాలాజీ నాయుడుకు కఠిన శిక్షలు పడేలా కేసు దర్యాప్తు పూర్తి చేస్తే మళ్లీ ఎవరూ మోసపోకుండా ఉంటారు. ఈ సారైనా పోలీసులు ఆ పని చేస్తారా..? లేదా..? చూడాలి.