iDreamPost
android-app
ios-app

ఫ్యామిలీ సూసైడ్ : ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

ఫ్యామిలీ సూసైడ్ : ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో పాల్వంచ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జ‌న‌వ‌రి 3 వ తేదీన పాల్వంచ‌లో రామ‌కృష్ట అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పాల్వంచలోని పాత బజార్ కి చెందిన రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసి వదలడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని త‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం వ‌న‌మా రాఘ‌వ అని, ఆయ‌న చేసిన అక్ర‌మాల గురించి సెల్పీ వీడియోలో వెల్లడించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆస్తుల తగవు తీర్చమంటే తన భార్యను పంపమన్నాడని ఆరోపించారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని రాజ‌కీయ పార్టీలు వ‌న‌మా ఇంటిని చుట్టుముట్టారు. ఈ విషయమై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు వనమా రాఘవేంద్రరావు ను పోలీసులకు అప్పగిస్తానని,పోలీసులకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు.

తన కొడుకు వనమా రాఘవేంద్రరావు పై ఆరోపణలు వచ్చిన క్రమంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా నా కొడుకుని అప్పగిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన లేఖ రాసిన కాసేపటికే రాఘ‌వ‌ను ఎమ్మెల్యే వ‌న‌మా పోలీసుల‌కు అప్ప‌గించారు. కొత్త‌గూడెం నుంచి వ‌చ్చిన పోలీసులు వ‌న‌మా రాఘ‌వ‌ను హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకెళ్లారు.అయితే, పోలీసుల‌కు అప్ప‌గించే ముందు రాఘ‌వ మీడియాతో మాట్లాడేందుకు ప‌ట్టుబట్టగా మీడియా ముందుకు రాకుండానే రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వనమా రాఘవపై 302, 306,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.