కరోనా దేశంలో తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలే కాక సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కరోనా బారినపడ్డారు.
వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గత కొన్నిరోజులుగా పలు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం తిరుపతికి వెళ్లివచ్చారు. ఈ క్రమంలో ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకినట్లు తేలడంతో వల్లభనేని వంశీ 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారెంటయిన్ లో గడపాలని వంశీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 3,342 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో 8,04,026 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 22 మంది కరోనా కారణంగా మరణించగా మృతుల సంఖ్య 6,566 కి చేరింది. 3,572 మంది కరోనా బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,469 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..