iDreamPost
iDreamPost
శ్రీకాకుళం జిల్లా వర్తమాన రాజకీయాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది ప్రత్యేక స్థానం. మంచి మాటకారిగా, రాజకీయ వ్యూహ చతురుడిగా పేరున్న ఆయన ఏం చేసినా దానికో లెక్క ఉంటుందని ఆయన అనుయాయులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నమ్ముతారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అతి సన్నిహితుల్లో ఒకరిగా ఇటు జిల్లాలో.. అటు రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన ధర్మాన.. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేశారు. అయితే ఆ తర్వాత నుంచి మౌనం వహించిన ఆయన కొద్ధి రోజుల నుంచి రాజకీయంగా క్రియాశీలమయ్యారు. ఆయన జోరు చూసి పార్టీ శ్రేణుల్లో కూడా హుషారు పెరిగింది.
జిల్లాపై అవగాహన, పట్టు
నాలుగు దశాబ్దాల క్రితం పొలాకి మండలం మబగాం సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ధర్మాన.. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. 1989లో గెలిచి నేదురుమిల్లి జనార్ధనరెడ్డి కేబినెట్లో తొలిసారి చేనేత జౌళీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి 1994, 1999, 2004, 2009, 2019 ఎన్నికల్లో గెలిచి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. నాటి వైఎస్ కేబినెట్లో రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా 2013లో కాంగ్రెసుకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయినా..2019లో మళ్లీ నెగ్గారు.
Also Read : ఆ ఘనత ఎవరిది అచ్చెం నాయుడు..?
మౌనం వీడి.. జనంలోకి..
ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మానకు జగన్ కేబినెట్లో చోటు లభిస్తుందని అందరూ భావించారు. కానీ జగన్ మాత్రం ధర్మాన అన్నయ్య కృష్ణదాస్ కు అవకాశం కల్పించారు. మొదటి నుంచీ పార్టీతో ఉన్నారన్న కోణంలో ఆయనకు గుర్తింపునిచ్చారు. బహుశా ఈ కారణం వల్లే కావచ్చు ధర్మాన ప్రసాద్ అప్పటి నుంచి రాజకీయంగా మౌనం పాటించారు. గత ఏడాది మార్చి నుంచి ప్రబలిన కోవిడ్ కూడా కొంత కారణమైంది. క్యాంపు కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగించిన ధర్మాన.. కోవిడ్ కారణంతో దాన్ని కూడా మూసేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ పూర్వపు ధర్మాన కనిపిస్తున్నారు. రాజకీయంగా యాక్టీవ్ అయ్యారు. కొద్ది రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమర్శలు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉంటున్నారు. క్యాంప్ కార్యాలయం మళ్లీ సందర్శకులతో కళకళలాడుతోంది. మంత్రి పదవిపై ఆశతోనే ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి.. కొత్తవారికి అవకాశం ఇస్తానని అధికారం చేపట్టినప్పుడు సీఎం జగన్ చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తూ.. ఆ సమయం వచ్చినందునే ధర్మాన చురుగ్గా మారారని అంటున్నారు. కాదు కాదు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందునుంచీ సమాయత్తం కావాలన్న ఉద్దేశంతో ఉన్న ధర్మాన.. కరోనా ఉద్ధృతి తగ్గినందున స్పీడ్ పెంచారని కార్యకర్తలు వాదిస్తున్నారు. కారణం ఏదైనా ధర్మాన మళ్లీ క్రియాశీలం కావడం మేలు చేస్తుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
చలనం లేని టీడీపీ
మరోవైపు శ్రీకాకుళం నగరంలో కాస్త పట్టున్న తెలుగుదేశం ఇటీవలి కాలంలో నిస్తేజంగా మారింది. నగర టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం పిలుపు మేరకు ఆయా కార్యక్రమాలను మాత్రం మొక్కుబడిగా ఇంటివద్దే నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు లక్ష్మీదేవి ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. పార్టీ శ్రేణులు కూడా చాలావరకు చెదిరిపోయాయి. ఇప్పటికిప్పుడు నగరపాలక ఎన్నికలు నిర్వహిస్తే సగం డివిజన్లకు సరైన అభ్యర్థులు దొరకడమే కష్టం అన్నట్లుంది టీడీపీ పరిస్థితి. ఈ తరుణంలో ధర్మాన మళ్లీ జనంలోకి రావడంతో వైఎస్సార్సీపీ మరింత పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఉద్యమాల హరిబాబుకు గవర్నర్ జాబు