iDreamPost
android-app
ios-app

గుడ్ మార్నింగ్ చెప్పేందుకు మరికొందరు రెడీ!

గుడ్ మార్నింగ్ చెప్పేందుకు మరికొందరు రెడీ!

ప్రజలకు పాలన దగ్గర కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులే. ప్రజలతో వారు మమేకం అయినప్పుడే కింది స్థాయిలో జరుగుతున్న పాలనా తతంగం అర్థమవుతుంది. అసలు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. లోపాలను సరి చేసుకోవడం, తప్పులు దిద్దుకోవడం ప్రజలతో మాట్లాడినప్పుడే జరుగుతుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ భరత్ గాని ఇదే చేస్తున్నారు. కోడి కూయక ముందే నియోజకవర్గంలోని ప్రజల ముంగిట వీరు వాలిపోతున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గుడ్ మార్నింగ్ దెందులూరు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

సులభంగా… సరళంగా!

పాలన ఎప్పుడు సులువుగా ఉండాలి చిక్కుముళ్లు ఉండకూడదు. ప్రజలకు సంక్షేమ పథకాలు సరళంగా అందాలి. సంక్లిష్టంగా మారకూడదు. ఇదే సూత్రాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మొదటినుంచీ అనుసరించారు. ఆయన 2019లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి గడపను, ప్రతి వ్యక్తిని కలుసుకోవాలని ఉద్దేశంతో గుడ్మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంను మొదలుపెట్టారు. కొద్ది రోజులకే రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ కుమార్ కూడా ఇదే బాటలో ఉదయమే రాజమండ్రి నియోజకవర్గ ప్రజలను కలుసుకునేందుకు వినూత్న పంథాలో ఆలోచించారు. వీరిద్దరూ 2019 లో జగన్ ప్రభుత్వం రాగానే ఈ కొత్త కార్యక్రమాలకు తమ నియోజకవర్గాల్లో శ్రీకారం చుట్టారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ నుంచి మంచి ప్రోత్సాహం లభించడంతో ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇదే బాట పడుతున్నారు.

ఉదయం వేళల్లో ప్రజల వద్దకు వెళ్లిన సమయంలో అందరూ ఇళ్ల వద్ద ఉంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ వస్తున్నారని ఎవరూ పనులు మానుకొని ఇంటి వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి లేదు. దీంతో ప్రతి ఒక్కరిని ప్రజాప్రతినిధులు కలవడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి అలా వీధిలో నడిచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోని వాళ్ళను తమ కుటుంబ సభ్యుల కంటే మిన్నగా పలకరించడం వారిని దగ్గర చేస్తోంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని డైరెక్టుగా ప్రజా ప్రతినిధులు వచ్చి అడగడంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సంకోచించడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు తమ సాధారణ సమస్యలను సైతం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు.

గతంలో ఆయా వీధుల్లోని నాయకులు చెప్పిందే సమస్య, వారు చేసిందే పరిష్కారం అన్నట్లు ఉండేది. దీంతో ఆయా ప్రాంతాల్లోని నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారి పనులు చేస్తూ ఇష్టం లేని వారి పనులు పక్కన పెట్టేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్లి సమస్యలను అడుగుతుండటంతో మధ్యలో ఎక్కడ సమస్య పరిష్కారం కాకుండా ఆగిపోయేఎందుకు లేదు.

ప్రజా ప్రతినిధులు వెంట అధికారులు సైతం రావడంతో అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే అధికారులకూ తగిన సూచనలు ఇచ్చి వెంటనే దానిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటు, దానిని ఫాలోఅప్ చేసుకోవడానికి స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఎక్కడ సమస్య కనిపించడం లేదు. సాధారణ చిన్న చిన్న సమస్యలు సైతం అక్కడికక్కడే అయిపోతున్నాయి.

ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అర్హత ఉండి కూడా అందని వారికి సులభంగా అందుతున్నాయి. పథకాలు అందకుండా ఉండడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే వాటిని పరిష్కరించే లా, అమ్మ ఒడి, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇంటి స్థలాలు, తదితర పథకాలన్నీ అర్హులకు అందేందుకు ప్రజాప్రతినిధులే చొరవ తీసుకొని మరీ పనులు చేస్తున్నారు. దీంతో ఎక్కడ అర్హులకు అన్యాయం జరగడం లేదు.

నియోజకవర్గంలో రోజు వారీ పర్యటనలకు ప్రత్యేకమైన రూట్మ్యాప్ లేకుండా ప్రజాప్రతినిధులు వెళ్లడం మరో విశేషం. ఏ ప్రాంతానికి ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నారు అన్నది ముందుగా తెలియ కుండానే ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో వాస్తవ పరిస్థితులు అర్థం అవుతున్నాయి. అధికారులు లేదా క్షేత్రస్థాయి సిబ్బంది వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు చెప్పేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో అధికారుల పనితీరు, కిందిస్థాయి సిబ్బంది ఎలా పని చేస్తున్నారన్నది ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ సిబ్బంది లోనూ ఆజమాయిషీ పెరుగుతుంది.

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎప్పటి వరకు సుమారు 8 వేల సమస్యలు పైగా పరిష్కారం అయ్యాయి. దీనిలో ఎక్కువ భాగం అక్కడికక్కడే పరిష్కరించిన వి. కొన్ని మాత్రం అధికారులు తగిన విధంగా స్పందించి పూర్తి చేసినవి. గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా సంక్షేమ పథకాలు రాలేదని, తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు లేవని, ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని ఎక్కువగా ప్రజాప్రతినిధులను కోరుతుంటారు. వీటిలో ఎక్కువ భాగం వెంటనే చేసేవి అయితే మరి కొన్ని అధికారులతో చొరవతో చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రజా ప్రతినిధులు అక్కడే సూచనలు ఇవ్వకుండా మరోసారి అధికారులను ఫాలో చేయడంతో సమస్యలన్నీ దాదాపు తీరుతున్నాయి.

ఉదయం వేళల్లో ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడం వల్ల ప్రభుత్వం మీద ప్రజా ప్రతినిధుల మీద సానుకూల స్పందన వస్తోంది. ఇటీవల ధర్మవరం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 44 వార్డులకు 44 అధికార పార్టీ కైవసం చేసుకుంది. అంటే పట్టణ స్థాయి ఓటర్లు సైతం ప్రజా ప్రతినిధులు దగ్గరకు రావడం పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మిగిలిన నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.