iDreamPost
iDreamPost
మహానటితో జాతీయ స్థాయిలో అవార్డులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల ప్రేమను గెలుచుకున్న కీర్తి సురేష్ కొత్త సినిమా మిస్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. థియేటర్లు తెరిచారు కదా వాటిలోనా అనుకోకండి. ఓటిటిలోనే రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా నవంబర్ 4న వరల్డ్ ప్రీమియర్ ద్వారా అందుబాటులోకి తేబోతున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ తో పాటుగా ప్రకటించారు. ఇందాక విడుదల చేసిన వీడియోలో మిస్ ఇండియా కథలోని కీలకమైన అంశాలను రివీల్ చేశారు. గత కొంత కాలంగా స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ కు దీని రూపంలో మరోసారి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్ర దొరికింది.
స్టోరీ విషయానికి వస్తే సంయుక్త(కీర్తి సురేష్)చిన్నప్పటి నుంచే గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకనే వాతావరణం ఇంట్లో ఉంటుంది. అందులోనూ మధ్య తరగతి కుటుంబం. కానీ సంయుక్త తన పట్టుదలను వదులుకోదు. అనుకున్నట్టే కష్టనష్టాలు భరించి విదేశాలల్లో మన ఇండియన్ ఛాయ్ అని అమ్మే వ్యాపారం మొదలుపెడుతుంది. తన బ్రాండ్ కు మిస్ ఇండియా అని పేరు పెడుతుంది. కానీ అక్కడ కెఎస్కె(జగపతిబాబు)రూపంలో పెద్ద శత్రువు పొంచి ఉంటాడు. తనతో ఢీ కొనే సవాలుకు సంయుక్త సిద్ధమవుతుంది. ఈ పందెంలో తను ఎలా గెలిచిందన్నదే మిస్ ఇండియా.
ట్రైలర్ మంచి ఇంటెన్సిటీతో ఉంది. అమ్మాయిల పట్ల సమాజంలో ఉన్న వివక్షను ప్రశ్నిస్తూ వాళ్లకు సరైన అవకాశాలు ఇస్తే ఎలాంటి అద్భుతాలు చేయగలరో ఇందులో చక్కగా చూపించినట్టు కనిపిస్తోంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. కంటెంట్ గట్టిగానే కనిపిస్తోంది. ఇంత ఓపెన్ గా కథ మొత్తం రెండు నిమిషాల వీడియోలోనే చెప్పేశారంటే కంటెంట్ మీద గట్టి నమ్మకమే ఉంది. నరేంద్ర నాధ్ దర్శకత్వం వహించిన మిస్ ఇండియాకు మహేష్ కోనేరు నిర్మాత. అధిక శాతం షూటింగ్ యుఎస్ లో చేశారు. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. పెంగ్విన్ తర్వాత డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లో వస్తున్న కీర్తి సురేష్ రెండో సినిమా ఇది