వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు మద్దతూ తెలుపుతూ కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఎక్కడా ఏపీకి ఒకే రాజధాని ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేసింది.
అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే సమయంలో సీఆర్డీఏని రద్దు చేస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ ప్రతిపక్ష టీడీపీ, అమరావతి జేఏసీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ స్టేటస్ కోని విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను వినిపించగా కేంద్రం తమ అఫిడవిట్ ను దాఖలు చేసింది. రాజధానుల నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి అంటూ స్పష్టం చేసిన కేంద్రం ఆ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోబోమని అఫిడవిట్ లో పేర్కొంది.
కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై అమరావతి జేఏసీ సంతృప్తి చెందలేదు. జేఏసీ తరుపున సాంబశివరావు అనే వ్యక్తి హైకోర్టులో పీటీషన్ దాఖలు చేశారు. అమరావతిని రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కేంద్రం నిధులు ఇచ్చిందంటూ ఆయన పీటీషన్ లో తెలిపారు. నిధులు ఇచ్చిన కేంద్రం రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నట్లే అంటూ ఆయన పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు లేదని పీటీషనర్ తెలిపారు. ఈ పీటీషన్ ను విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కోని కొనసాగిస్తూ కేంద్రానికి మరింత స్పష్టత ఇవ్వాలంటూ మరోమారు నోటీసులు జారీ చేసింది.
అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
హైకోర్టు నోటీసులతో కేంద్ర హోంశాఖ అదనపు అఫిడవిట్ ను దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఎక్కడా ఒకే రాజధాని ఉండాలనే నిబంధన లేదని కేంద్రం తమ అఫిడవిట్ లో తెలిపింది. గత ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా తాము నిధులు ఇచ్చామని కేంద్రం గుర్తు చేసింది. రాష్ట్రాల నిర్ణయాలలో కేంద్రం ఎట్టి పరిస్థితులలో జోక్యం చేసుకోదని అఫిడవిట్ లో పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటే ఉండాలనే అర్ధం కాదని వివరణ ఇచ్చింది.
రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని తేల్చి చెప్పిన కేంద్రం ఆర్థిక సాయం మాత్రమే తాము చేస్తామని స్పష్టం చేసింది. 2018లో గత ప్రభుత్వం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసిందని పేర్కొన్న హోంశాఖ న్యాయవ్యవస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకున్నట్లు కాదని వెల్లడించింది. కేంద్రం ఇచ్చిన స్పష్టమైన వివరణతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీతో కలిసి 29 గ్రామాల అమరావతి జేఏసీ గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్న విషయం విదితమే. కేంద్రం ఇచ్చిన వివరణతో వారు నిరసనలకు స్వస్తి పలుకుతారా? లేదా? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.