iDreamPost
android-app
ios-app

అమూల్ తో ఒప్పందం వెనుక అసలు వాస్తవాలు, అమాత్య హోదాలో వివరణలతో ఆడుకున్న డాక్టర్ అప్పలరాజు

  • Published Dec 04, 2020 | 10:52 PM Updated Updated Dec 04, 2020 | 10:52 PM
అమూల్ తో ఒప్పందం వెనుక అసలు వాస్తవాలు, అమాత్య హోదాలో వివరణలతో ఆడుకున్న డాక్టర్ అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్ లో అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సభలో మంత్రిగా ఆయన మూడు బిల్లులను ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ ఆయన ఎంతో అనుభవం ఉన్న నేతగా వ్యవహరించి పరిణతి ప్రదర్శించడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం అసెంబ్లీ సాక్షిగా ఆయా బిల్లులపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అందరినీ ఆకట్టుకునేలా, పూర్తి విషయాన్ని స్పష్టంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి హోదాలో డాక్టర్ అప్పలరాజు చేసిన ప్రసంగం ఓవైపు వివరణ, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా సాగింది. అన్ని ఆధారాలు, పూర్తి స్థాయి లెక్కలతో ఆయన చేసిన ఉపన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. పలువురు ఎమ్మెల్యేలతో పాటుగా ప్రభుత్వ పెద్దలు కూడా మంత్రిని అభినందించడం విశేషం. .

అమూల్ సంస్థ కార్పోరేట్ సంస్థ గా చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థకు మళ్లీ జగన్ ప్రాణం పోశారని వివరించారు. గ్రామ స్థాయిలో మహిళా రైతులతో సహకార సంఘం, జిల్లా స్థాయిలో వారితో కలిపి ఓ కమిటీ, రాష్ట్రస్థాయిలో ఏపీడీడీసీ ఆధ్వర్యంలో మొత్తం పాలసేకరణ జరుగుతోందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సహకార వ్యవస్థ నుంచి మ్యాక్స్ సొసైటీకి ఆ తర్వాత దానిని ప్రైవేటుకి మార్చి తమ లాభాల కోసం వ్యవస్థను నాశనం చేశారంటూ పరోక్షంగా చంద్రబాబు హెరిటేజ్ సంస్థ వ్యవహారాన్ని తప్పుబట్టారు.

ఏపీలో మొత్తం 400 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే అందులో 24 శాతం మాత్రమే వివిధ ప్రైవేటు, సహకార డెయిరీల ద్వారా సేకరణ జరుగుతోందన్నారు. 60లక్షల లీటర్లు మాత్రమే మార్కెట్ చేయగలుగుతున్నాయన్నారు. 200 లక్షల లీటర్లు మిగులుగా ఉండిపోతోందన్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 80శాతం సంఘటిత రంగంలో ఉంటే ఏపీలో దానికి భిన్నంగా అసంఘటితరంగంలో మిగిలిపోతోందన్నారు. దానిని రైతులకు మేలు చేసేలా చేస్తుంటే చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏమిటని ఆయన సూటిగా ప్ర్రశ్నించారు. ఇప్పటికే లోకేష్ ప్రకటన ప్రకారం వారికేమీ నష్టం లేనప్పుడు ఎందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని నిలదీశారు. కావాలంటే రైతులకు ధరలు పెంచి, ఉచితంగా పశువులు పంపిణీ చేసి తమ లాభాలు కొనసాగించుకోవాలని ఆయన లెక్కల ఆధారంగా సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి ఓ లేఖను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి రాసిన లేఖను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. జగన్ కృషిని అభినందిస్తూ అభిమాని సంతోషంగా చెప్పిన అంశాలను మంత్రి అప్పలరాజు స్వయంగా సభలో చదివి వినిపించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా ఉన్న అమూల్ పాలసేకరణ అంశానికి సంబంధించిన సమగ్ర విషయాన్ని మంత్రి స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. పాల రైతుకి లీటర్ కి రూ. 4 ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్ దానికి మించి మేలు చేసేలా అమూల్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉదాహరణలతో ఎలా మేలు కలుగుతుందన్నది ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ప్రయోగాత్మంగా ప్రారంభించిన ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో జరుగుతున్న మార్పులను ఆయన తెలియజేశారు. రైతుల నుంచి వస్తున్న స్పందన సభ దృష్టికి తెచ్చారు. మొత్తంగా మంత్రి హోదాలో డాక్టర్ సీదిరి అప్పలరాజు పూర్తిగా హోం వర్క్ చేసి సభలో చేసిన ప్రసంగం అందరి దృస్టిని ఆకర్షించిందనే చెప్పవచ్చు.