iDreamPost
iDreamPost
రాజకీయాల్లోకి వచ్చినా.. మంత్రిగా ఎదిగినా.. ఆపదలో ఉన్న వారికి, పేదలకు సేవ చేయడానికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అదే సుగుణం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పేదల పెన్నిధిగా నిలిపింది. ఇదే క్రమంలో మంత్రి అప్పలరాజులోని పేదల వైద్యుడు మరోసారి బయటకొచ్చాడు. తక్షణ వైద్య సేవలతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. ఇద్దరు బిడ్డలతో సహా తల్లిని ప్రాణాపాయం నుంచి బయటపడేశాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ కుటుంబపరమైన విషయాల్లో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి.. తాను కూడా సేవించింది. దాంతో ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న తల్లీబిడ్డలను గమనించిన కుటుంబీకులు, స్థానికులు వారిని వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెంటనే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. వారి పరిస్థితి గురించి ఆరా తీశారు. తక్షణం చికిత్స ప్రారంభించాలని, తాను కూడా వస్తున్నానని చెప్పారు. ఏదో కార్యక్రమంలో ఉన్న ఆయన అక్కడి నుంచే హుటాహుటిన పలాస ఆస్పత్రికి చేరుకుని మిగతా వైద్యులతో పాటు తాను స్వయంగా బాధితులకు చికిత్స చేసి.. తల్లీబిడ్డలు ముగ్గురినీ ప్రాణగండం నుంచి తప్పించారు.
సీదిరి అప్పలరాజుకు పలాస ప్రాంతంలో మొదటి నుంచీ ప్రజావైద్యుడు అన్న పేరుంది. ఆ పేరుప్రతిష్టాలే ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. వైఎస్సార్సీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి పలాస ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైనప్పుడు ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. దానికి తాజా ఉదాహరణ పలాస ఘటన. తక్షణం స్పందించి తల్లీబిడ్డలు ముగ్గురికీ పునర్జన్మ ప్రసాదించిన మంత్రిని బాధిత కుటుంబీకులు, బొడ్డపాడు గ్రామస్థులు ప్రశంసల్లో ముంచెత్తారు. మంత్రిగా ఉన్నప్పటికీ వైద్య వృత్తిని, సేవాధర్మాన్ని వీడని మంత్రి అప్పలరాజుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.